Thursday, April 25, 2024
Homeస్పోర్ట్స్Pant Century: వన్డే సిరీస్ ఇండియాదే

Pant Century: వన్డే సిరీస్ ఇండియాదే

ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే నేటి కీలక మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్లతో విజయం సాధించింది. రిషభ్ పంత్ 125 పరుగుల (113 బంతులు, 16 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, హార్దిక్ పాండ్యా మరోసారి తన ఆల్ రౌండ్ ప్రతిభతో సత్తా చాటి బౌలింగ్ లో నాలుగు వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్ లో 71 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ విసిరిన 260 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇండియా 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది.

మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో మహమ్మద్ సిరాజ్ ఇద్దరు కీలక బ్యాట్స్ మెన్ ను డకౌట్ చేసి (బెయిర్ స్టో, రూట్) ఇంగ్లాండ్ ను దెబ్బతీశాడు. జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్-60; ఓపెనర్ జేసర్ రాయ్-41; క్రేగ్ ఓవర్టన్-32, మొయిన్ అలీ-34 రాణించారు, 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు; యజువేంద్ర చాహల్ మూడు; సిరాజ్ రెండు; రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా 38 పరుగులకే మూడు కీలక వికెట్లు (శిఖర్ ధావన్-1; రోహిత్ శర్మ-17; విరాట్ కోహ్లీ-17) వికెట్లు కోల్పోయింది. ఈ ముగ్గురూ టాప్లే బౌలింగ్ లోనే ఔటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రిషభ్, పాండ్యాలు ఐదో వికెట్ కు 133 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. పాండ్యా 71 పరుగులు చేసి ఔట్ కాగా, రవీంద్ర జడేజా 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లే మూడు; బ్రిడాన్ కార్స్, ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు.

రిషభ్ పంత్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’; హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ అఫ్ ద  సిరీస్’ లభించింది.

తాజా టూర్ లో భాగం గా ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టి20 సిరీస్ లు ఇంగ్లాండ్- ఇండియా మధ్య జరగ్గా టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపొందింది. వన్డే, టి-20 సిరీస్ ను ­2-1 తేడాతో ఇండియా గెల్చుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్