కైకాల సత్యనారాయణ ఇక లేరు

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈ రోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియచేశారు. ఆయన ఇప్పటి వరకు 777 సినిమాల్లో నటించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణ 1935 జూలై 25 న జన్మించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు.

తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళారు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చారు.దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించటానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనుకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసారు.

సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించారు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయారు. ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత ఇలా ఎన్నో పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *