Sunday, October 1, 2023
Homeసినిమావిజయానికి మరో పేరు .. వి.మధుసూదనరావు

విజయానికి మరో పేరు .. వి.మధుసూదనరావు

Veteran Director Madhusudan Rao :

తెలుగు చిత్రపరిశ్రమలోని సీనియర్ దర్శకులలో వీరమాచనేని మధుసూదనరావు ఒకరుగా కనిపిస్తారు. వి. మధుసూదనరావుగానే ఆయన ఎక్కువమందికి తెలుసు. మొదటి నుంచి సినిమాలపట్ల ఆసక్తి ఉండటంతో ఆ దిశంగానే ఆయన అడుగులు వేశారు. 1959 నుంచి దర్శకుడిగా మొదలైన ఆయన ప్రయాణం 3 దశాబ్దాల పాటు కొనసాగింది. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి హీరోలకు ఆయన సూపర్ హిట్లను ఇచ్చారు. ముఖ్యంగా ఏఎన్నార్ కి చెప్పుకోదగిన సినిమాలను మధుసూదనరావు అందించారు.

కథ ఎలా ఉండాలి .. ఆ కథను ఎలా ఆవిష్కరించాలి .. కథనాన్ని ఎలా నడిపించాలి? అనే విషయాలు మధుసూదనరావుకి బాగా తెలుసు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు కథలో ఉండేలా చూసుకుని ఆయన సెట్స్ పైకి వెళ్లేవారు. కథపై ఎక్కడ ఎలాంటి సందేహం ఉన్నా ఆయన సెట్స్ పైకి వెళ్లేవారు కాదు. అలాగే పాత్రల స్వరూప స్వభావాలు దెబ్బతినకుండా చూసుకునేవారు. సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించేవారు. అందువలన పాత్రలు తెరపై కాకుండా, కళ్లముందు కదలాడుతున్నట్టుగా ప్రేక్షకులకు అనిపించేది.

Veteran Director Madhusudan Rao Stories :

అప్పటివరకూ తెరపై సాగిన కథల నడకను ఆయన ఒక్కసారిగా మార్చేశారు. కొత్తదనాన్ని పరుగులు తీయించారు. కథలను పకడ్బందీగా అల్లుకోవడం .. పట్టుగా నడిపించడం వంటి ప్రత్యేకతల వలన వరుస విజయాలు ఆయనను  వెతుక్కుంటూ వచ్చాయి. 60వ దశకంలో వచ్చిన ‘అన్నపూర్ణ’ .. ‘ఆరాధన’ .. ‘రక్తసంబంధం’ .. ‘ఆత్మబలం’ .. ‘వీరాభిమన్యు’ .. ‘అదృష్టవంతులు’ దర్శకుడిగా ఆయన ప్రతిభాపాటవాలకు అద్దం పడతాయి. వరుస హిట్లు ఇస్తున్న కారణంగానే అప్పట్లో అందరూ ఆయనను విక్టరీ మధుసూదనరావు అనేవారు.

మధుసూదనరావుకి కథాకథనాలపై ఎంతటి పట్టు ఉందో ..  సంగీతంపై కూడా ఆయనకి అంతే అవగాహన ఉంది. సందర్భానికీ .. పాత్రల స్వభావానికి తగినట్టుగా ఆయన ట్యూన్లు చేయించుకునేవారు. అందువలన ఆయన సినిమాల్లో చాలావరకూ మ్యూజికల్ హిట్లు కనిపిస్తాయి. ఇప్పటికీ ఆ సినిమాల్లోని పాటలు ఎక్కడో ఓ చోటున మోగుతూనే ఉంటాయి .. మనసు లోతుల్లోని అనుభూతులను తట్టి లేపుతూనే ఉంటాయి. అలాంటి సినిమాల జాబితాలో ‘మల్లెపూవు’ కూడా ఒకటిగా కనిపిస్తుంది. కొత్త పుంతలు తొక్కిన ఈ కథ .. ఒక పాటల పండుగలా అనిపిస్తుంది.

 

మధుసూదనరావు భక్తి చిత్రాలను తెరకెక్కించడంలోను తన సత్తాను చాటుకున్నారు. ఆయన రూపొందించిన ‘భక్త తుకారామ్’ .. ‘చక్రధారి’ నేటికీ భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూనే ఉన్నాయి. అప్పట్లో ఇక్కడివారికి పెద్దగా తెలియని మహారాష్ట్ర భక్తుల కథలను ఎంచుకోవడం ఒక సాహసమైతే, ఆ కథలను అద్భుతంగా ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నం ఒక ప్రయోగంగానే చెప్పుకోవాలి. ఆ సినిమాలు అనూహ్యమైన విజయాలను అందుకోవడం ఆయన గొప్పతనంగానే ఒప్పుకోవాలి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు పాటల పరంగా కూడా చెప్పుకోదగిన స్థాయిలో నిలవడం విశేషం.

ఇక హీరోగా  ‘విక్రమ్’ సినిమా ద్వారా నాగార్జునను .. ‘సింహస్వప్నం’ సినిమా ద్వారా జాగపతిబాబును పరిచయం చేసింది ఆయనే. నాయిక ప్రధానమైన కథలను ఆవిష్కరించడంలోను తనకి తిరుగులేదని మధుసూదనరావు నిరూపించుకున్నారు. నాయిక పాత్రచుట్టూ తిరిగే కథలతో ఆయన చేసిన సినిమాల్లో ‘కృష్ణవేణి’ .. ‘కాంచన గంగ’ సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. ఆయన దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన చాలామంది, ఆ తరువాత కాలంలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు.

Veteran Director Madhusudan Rao Dedication Towards Work :

మధుసూదనరావు క్రమశిక్షణ కలిగిన దర్శకులు .. ఏ విషయంలోనైనా ఒక పద్ధతి ఉండాలనేది ఆయన తత్వం. తను చేసే సినిమా తన కెరియర్ కంటే ఎక్కువగా నిర్మాత జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మిన వ్యక్తి ఆయన. అందువలన తొందరపడి సినిమాలు చేయడం ఆయన కెరియర్లో ఎక్కడా కనిపించదు. సినిమా విషయంలో ఆయన మొహమాటాలు పూర్తిగా పక్కన పెట్టేసేవారు. నిర్మాతల అభిప్రాయాలను గౌరవిస్తూనే, తాను అనుకున్న విధంగా కథలను తెరకెక్కించేవారు. సినిమా బాగా రావడం కోసం ఆయన ఏ విషయంలోను రాజీపడేవారు కాదు.

కథాకథనాల విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధ తెలిసిన కారణంగానే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ఉత్సాహం చూపించేవారు. అలా జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఆయనతో వరుస సినిమాలు చేశారు. ‘అ’ అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ తో తెరకెక్కిన ఆ సినిమాలన్నీ కూడా అనూహ్యమైన విజయాలను సాధించాయి. హైదరాబాద్ లో ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ ను స్థాపించి, ఎంతోమంది ఆర్టిస్టులను ఆయన తెరకి పరిచయం చేశారు. తెలుగు తెరపై మధుసూదనరావు ఒక కొత్త ఒరవడికి తెరతీశారు. ఆ తరువాత ఆయన శైలిని ఎంతోమంది అనుసరించారు. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా ఆయనను ఓ సారి స్మరించుకుందాం.

  (జయంతి ప్రత్యేకం)

– పెద్దింటి గోపీకృష్ణ

Also Read : తెలుగు పాటపై పరుచుకున్న పరిమళం- సినారె

Peddinti Gopi Krishna
Peddinti Gopi Krishna
ఎం.ఏ తెలుగు, బి ఈడి . ప్రింట్, టీ వి, డిజిటల్ మీడియాల్లో పాతికేళ్ల అనుభవం. భక్తి రచనల్లో అందెవేసిన చేయి. సినిమా విశ్లేషణల్లో సుదీర్ఘ అనుభవం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న