Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Siri Vennela:  తెలుగు సినిమా సాహిత్యానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ముందు వరుసలో ఉంటారు. ‘నా ఉఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం’ అంటూ కొన్ని వేల పాటలకు ప్రాణం పోశారు ఆయన. సిరివెన్నెల సాహిత్య సముద్రంలో మునగని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదేమో. తన కలంతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సిరివెన్నెల గతేడాది నవంబర్ 30న భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు పాట ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. పాటై మనకు వినిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన సిరివెన్నెల. సిరివెన్నెలంటేనే సాహిత్యం.. సాహిత్యమంటేనే సిరివెన్నెల.

జగమంత కుటుంబానికి వెలకట్టలేనంత సాహిత్య సంపదను అందించి సిరివెన్నెల మనకు దూరమయ్యాక నేడు ఆయన మొదటి జయంతి. ఈ సందర్భంగా సిరివెన్నెల రచించిన ప్రతి అక్షరాన్ని ముద్రించి పుస్తక రూపంలో అభిమానులకు అందించాలనే బృహత్ యజ్ఞం తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డా.తోటకూర ప్రసాద్ సంకల్పించి తానా మరియు సిరివెన్నెల కుటుంబం సహకారంతో సాకారం చేశారు. సినిమా సాహిత్యం నాలుగు సంపుటాలుగ, సినీయేతర సాహిత్యం మరో రెండు సంపుటాలుగ రానున్నాయి. మొదటి సంపుటి గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా విడుదలైంది.

సిరివెన్నెల జయంతి వేడుకలు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం సంపుటి-1’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని సిరివెన్నెల గారి సతీమణి పద్మావతి గారు అందుకున్నారు. గరికపాటి నరసింహారావు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తోటకూర ప్రసాద్ విశిష్ట అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు సినీ దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాన్య భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ.. “సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం మొదటి సంపుటి ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. సీతారామశాస్త్రి గారు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయన ప్రతిభ అప్పుడే నాకు తెలుసు. ఇంతింతై వటుఁడింతయై అన్నట్లు ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి గారితో గడిపిన ఆ క్షణాలు ఎంతో మధురమైనవిగా భావిస్తున్నాను. సినిమా పాటల రూపంలో తెలుగుతల్లికి పాటల పదార్చన చేసిన సీతారామశాస్త్రి గారికి నివాళులు అర్పిస్తున్నాను. పాట విలువను ఆర్థికంగా గాక, అర్థవంతంగా కొలిచే వారిలో సీతారామశాస్త్రి గారు అగ్రగణ్యులు. సినిమా పాటలలో విలువలని రాసులుగా పోశారాయన.

సిరివెన్నెల గారు ఒక గొప్ప కవి అనేదాని కన్నా.. ఒక అద్భుతమైన ఆలోచనలు కలిగించి, ఆనందింపచేసే మహా మనిషి ఆయన. మనం సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా రచనలకు, పద్యాలకు, ప్రవచనాలకు సమయం కేటాయించాలి. పాటలు మనల్ని రంజింపజేయడంతో పాటు మనకి దారిని చూపిస్తాయి. చీకటిలో వెన్నెలలా.. అది కూడా సిరివెన్నెలలా. మనస్సుని తట్టిలేపేలా ఆయన సాహిత్యం ఉంటుంది. కర్తవ్యం బోధింపచేస్తుంది. సిరివెన్నెల గారిని సినిమా పాటల రచయితగానే చూడలేం. నా అభిప్రాయం ప్రకారం ఆయనొక నిశ్శబ్ద పాటల విప్లవం. నవ్య వాగ్గేయకారుడు. ప్రపంచానికి చెప్పాలనుకున్న మాట పాట ద్వారానే చెప్పారు. ఆఖరి వరకు పాట కోసమే బ్రతికారు.” అన్నారు.

సుప్రసిద్ధ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” సీతారామశాస్త్రి గారితో చాలా వెన్నెల రాత్రులు గడిపాను. కానీ వెన్నెల లేని ఆయన గదిలో ఆయన ధూమ మేఘాల మధ్యలో ఆయన్నే చంద్రుడిలా చూశాను చాలాసార్లు. చాలా సంవత్సరాల పాటు మరుపురాని క్షణాలు, గొప్ప గొప్ప పాటలు. నా సినిమాలోవి మాత్రమే కాదు వేరే వాళ్ళ సినిమాలో పాటలు రాసినా సరే అర్థరాత్రి ఫోన్ చేసి శ్రీను మంచి ఒక లైన్ వచ్చింది విను అని చెప్పేవారు. అలాంటి ఎన్నో గొప్ప వాక్యాలను విన్నాను. ఒక కవి పాట పాడుతున్నప్పుడు విని ఆనందించగలడం గొప్ప అదృష్టం. అంతకు మించిన విలాసం మరొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కవి గొంతు గొప్పగా లేకపోయినా.. అతని గుండె గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన పాడి వినిపించిన గొప్ప గొప్ప పాటలు నా మదిలో మెదులుతున్నాయి. ఆయనతో గడిపిన సమయం చాలా గుర్తుపెట్టుకోగలిగినది. ఆయన సినిమా పాట కన్నా ఎత్తయిన మనిషి. పాటలో ఉన్న భావం కన్నా లోతైన మనిషి. అది మనకు అర్థమైన దానికన్నా విస్తారమైన మనిషి. దానిని మనం విశ్లేషించే దానికన్నా గాఢమైన మనిషి. అలాంటి మనిషితోటి కొన్ని సంవత్సరాలు గడపటం ఆనందం.. ఇంకా కొన్ని సంవత్సరాలు గడపలేకపోవడం బాధాకరం.

కొన్ని కావ్యాలకు ముగింపు ఉండకూడదు అనిపిస్తుంది. కొన్ని పుస్తకాలకు ఆఖరి పేజీ రాకూడదు అనిపిస్తుంది. కొన్ని సినిమాలకు క్లైమాక్స్ చూడకూడదు అనిపిస్తుంది. సీతారామశాస్త్రి గారు కూడా అలాంటి ఒక కావ్యం, అలాంటి ఒక పుస్తకం, అలాంటి ఒక చిత్రం. కళ్ళకి రంగులుంటాయి గానీ కన్నీరుకి రంగు ఉండదు. అలాగే పదాలకు రకరకాల భావాలు ఉంటాయి. కానీ ఆయన వాటన్నింటిని కలిపి ఒక మనిషిగా తయారు చేసి, ఒక మనిషి గుండెకి తగిలించే బాణంలా చేసి మన మీదకు విసరగలిగిన కవిగా ఆయనను చూస్తాను. సముద్రాల రాఘవాచార్యులు గారి దగ్గర నుంచి, పింగళి నాగేంద్రరావు గారి నుంచి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నుంచి, వేటూరి సుందర రామమూర్తి గారి దాకా.. తెలుగు సినిమా కవులు అంత తక్కువ వాళ్ళేం కాదు. చాలా గొప్ప స్థాయి పాటలు రాశారు వాళ్ళు. అలాంటి వాళ్ళ వృక్ష ఛాయలో ఇంకో మొక్క మొలవడమంటే దానికి ఎంత బలం ఉండుండాలి, దానికి ఎంత పొగరు ఉండుండాలి, దానికి ఎంత సొంత గొంతుక ఉండుండాలి. తన ఉనికిని చాటడానికి ఆయన రెండు చేతుల్ని పైకెత్తి, ఆకాశం వైపు చూసి ఒక్కసారి ఎలుగెత్తి అరిచాడు. నా ఉఛ్వాసం కవనం అన్నాడు.. నా నిశ్వాసం గానం అన్నాడు. శబ్దాన్నే సైన్యంగా చేశాడు.. నిశ్శబ్దంతో కూడా యుద్ధం చేశాడు. అలాంటి గొప్ప కవి మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన తాలూకు అక్షరాలు మనతోనే ఉన్నాయి. ఒక గొప్ప కవి తాలూకు లక్షణం ఏంటంటే.. కాలాన్ని ఓడించడం. ఎందుకంటే ధర్మం కాలంతో పాటు మారుతుంది.. కానీ సత్యం మారదు. ఆయన సత్యాన్ని మోస్తూ వచ్చాడు. అందుకే ఆయన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనకి రెలెవెంట్ గానే ఉంటాయి. అద్భుతం జరిగేముందు మనం గుర్తించం.. జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరంలేదు. సీతారామశాస్త్రి గారు నాకు తెలిసిన అద్భుతం.” అన్నారు.

Also Read : కన్నీటి జలపాతాల్లో…ఆగకసాగే బతుకుగానం.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com