భారతదేశ చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవని, భారతీయ రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప దాడుల కోసం కాదని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలతో స్నేహాన్నే కోరుకుంటోందని తెలిపారు. అదే సమయంలో దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ఉపరాష్ట్రపతి, మన రక్షణ అవసరాలకు తగిన ఉత్పత్తులు దేశీయంగా రూపొందడం, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుండటం ఆనందదాయకమని తెలిపారు.
బెంగళూరులోని హెచ్.ఏ.ఎల్. కాంప్లెక్స్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి, అక్కడి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే కాలంలో భారతదేశాన్ని వైమానిక మరియు రక్షణ రంగాల్లో శక్తికేంద్రంగా తీర్చిదిద్దడంలో దేశీయ ఉత్పత్తులు కీలకపాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రక్షణ రంగానికి ఎఫ్.డి.ఐ. పరిమితి పెంపు, ఉత్తరప్రదేశ్ – తమిళనాడుల్లో రెండు రక్షణ నడవాల ఏర్పాటు నిర్ణయం, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రెండు సానుకూల స్వదేశీకరణ జాబితాల నోటిఫికేషన్ వంటి చర్యలు భారతదేశ రక్షణ రంగానికి గొప్ప అవకాశమన్న ఉపరాష్ట్రపతి, భారత వైమానిక రంగం ఇటీవల హెచ్.ఏ.ఎల్.తో చేసుకున్న 83 తేజస్ ఫైటర్ జెట్ ఒప్పందాన్ని ప్రస్తావించారు. పెద్ద సంఖ్యలో భారతీయ కంపెనీల ప్రమేయాన్ని అభినందించిన ఆయన, అంటువంటి ప్రాజెక్టుల ద్వారా భారతీయ వైమానిక రంగ తయారీ పర్యావరణ వ్యవస్థను తనకాళ్ళ మీద తాను నిలబడే శక్తివంతమైన ఆత్మనిర్భర్ గా మార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అంతకు ముందు ఉపరాష్ట్రపతి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఎల్.సి.ఏ. తేజస్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అత్యాధునిక ఆధునిక యుద్ధవిమానాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అభినందించారు. 4ప్లస్ తరం విమానాలు భారత వైమానికదళ అవసరాలను తీర్చేందుకు ఇదో శక్తివంతమైన వేదిక అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, హెచ్.ఏ.ఎల్. ఛైర్మన్ ఆర్. మాధవన్, సంచాలకులు అలోక్ వర్మ సహా పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.