Friday, March 29, 2024
Homeసినిమాప్రత్యేకతలతో పట్టు నిలుపుకున్న నటి

ప్రత్యేకతలతో పట్టు నిలుపుకున్న నటి

Dynamic Director: తెలుగు తెరకి పరిచయమైన అలనాటి కథానాయికలలో విజయనిర్మల ఒకరు. ‘పాండురంగ మహాత్మ్యం‘  సినిమాలో బాలకృష్ణుడి వేషంతో ఆమె నటనా ప్రస్థానం మొదలైంది. ఆ తరువాత కొంతకాలానికి కథానాయికగా తొలి అడుగులు వేసిన ఆమె .. ఆ అడుగులను పరుగులుగా మార్చారు. ఒక వైపున సావిత్రి .. జమున, మరో వైపున శారద .. వాణిశ్రీ, ఇంకో వైపున కృష్ణ కుమారి .. కాంచన రంగంలో ఉండగానే విజయనిర్మల కథానాయికగా కొనసాగారు. నటన పరంగా .. గ్లామర్ పరంగా అంత గట్టి పోటీ ఉన్న ఆ సమయంలో ఆమె నిలదొక్కుకోవడమనేది అంత తేలికైన విషయమేం కాదు.

అయినా విజయనిర్మల ధైర్యంగా ముందుకు వెళ్లారు. ప్రతి సినిమాతోను తనదైన ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నించారు. అల్లరితనం .. ఆకతాయితనం కూడిన పాత్రలను మాత్రమే కాదు, బరువైన పాత్రలను పోషించడంలోను ఆమె తనదైన ముద్రవేశారు. ఆకర్షణీయమైన కళ్లతో హావభావాలను అద్భుతంగా పండించగలిగిన కథానాయికగా ప్రేక్షకుల మనసులను దోచేశారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ సినిమాల్లోను నటించారు.

విజయనిర్మల వాయిస్ ప్రత్యేకంగా ఉండేది. సహజమైన ఆమె నటనకు ఆ వాయిస్ ప్రధానమైన బలంగా నిలిచింది. అంతమంది కథానాయికలను దాటుకుని ఆమె వరకూ అవకాశాలు రావడానికి కారణం ఆ ప్రత్యేకతనే అనుకోవాలి. విజయ నిర్మల చాలా చురుకుగా .. చలాకీగా ఉండేవారు. ఒక వైపున నటిస్తూనే మరో వైపున డైరెక్షన్ కి సంబంధించిన విషయాలపై ఆమె దృష్టి పెట్టేవారు.  సాధారణంగా కథానాయికలలో చాలామంది తమ షాట్ పూర్తికాగానే అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. కానీ విజయనిర్మల కెమెరా వెనక్కి వచ్చి ఆ వైపు నుంచి ఏం జరుగుతుందనేది గమనించేవారు. అలాగే కథాకథనాలపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టేవారు.

కృష్ణతో కలిసి కొన్ని సినిమాలు చేయడం వలన, ఆ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడం .. పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. వివాహమైన తరువాత కూడా ఇద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించారు. దర్శకత్వం చేయాలనే ఉత్సాహంతో ఆమె మెగా ఫోన్ పట్టి ఎక్కువ సినిమాలు చేసింది కూడా కృష్ణతోనే. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే కృష్ణ హీరోగా విజయనిర్మల తెరకెక్కించిన సినిమాలు కూడా చాలావరకూ విజయవంతమయ్యాయి.

కృష్ణ – విజయనిర్మల కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఎప్పటికీ చెప్పుకోదగిన సినిమాగా ‘మీనా’ కనిపిస్తుంది. నటిగా .. దర్శకురాలిగా విజయనిర్మల ప్రతిభకు ఈ సినిమా ఒక మచ్చుతునకలా కనిపిస్తుంది. ఇక విజయనిర్మలకి సినిమా సంగీతంపై కూడా మంచి అవగాహన ఉంది. ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆమె సినిమాల్లోని పాటలు చాలా వరకూ హిట్. ఇప్పటితో పోలిస్తే అప్పట్లో ఒక మహిళ దర్శకత్వం చేయడమనేది మరింత కష్టం. అయినా ఆ పనిని ఆమె ఎంతో సమర్థవంతంగా చేశారు.

ఇటు నరేశ్ తోను అటు కృష్ణతోను సినిమాలను తెరకెక్కించారు. కుటుంబ కథా చితాలను వాస్తవానికి చాలా దగ్గరగా ఆవిష్కరించారు. దర్శకురాలిగా ఆమె పెద్దగా గ్యాప్ తీసుకునేవారు కాదు. ఒక సినిమా తరువాత మరో సినిమాను లైన్లో పెట్టేస్తూ 40 సినిమాలకి పైగా దర్శకత్వం వహించారు.  ప్రపంచంలో అత్యధిక చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.

విజయనిర్మల తాను కథానాయికగా సక్సెస్ ను సాధించారు .. దర్శకురాలిగా పేరు ప్రతిష్ఠలను సొంతం చేసుకున్నారు. ఒక వైపున హీరోగా నరేశ్ కీ .. మరో వైపున కృష్ణకి సక్సెస్ లు ఇచ్చారు. అసమానమైన ప్రతిభకు కొలమానంగా .. వెండితెరకి దక్కిన బహుమానంగా ఆమె నిలిచారు. ఇక కృష్ణ – విజయ నిర్మల దాంపత్యం కూడా ఎంతో అన్యోన్యంగా .. ఆదర్శప్రాయంగా కొనసాగింది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండేలా చూసుకున్న ఆమె జయంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆమెను స్మరించుకుందాం.

(విజయనిర్మల జయంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్