సిఎం జగన్ సూచన మేరకే ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు చూస్తున్నానని, అంతే కానీ వ్యాపారం చేయడానికో, భూకబ్జాలు చేసేందుకో ఇక్కడకు రాలేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో తాను భూదందాలకు పాల్పడుతున్నానని, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి ఆవేదన వ్యక్తం చేశారు. దందాలు చేయాల్సిన అవసరం తనకేమాత్రం లేదని భగవంతుడి సాక్షిగా చెబుతున్నానని ఉద్వేగంగా ప్రకటించారు.
దివంగత నేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయసాయి పాల్గొన్నారు. తనపై విపక్షాలు చేస్తున్నఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని, తన చిత్తశుద్దిని శంకిస్తున్నవారే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. తనకు డబ్బుపై ఏమాత్రం వ్యామోహం లేదని, హైదరాబాద్ లో తాను ఉంటున్న ఇల్లు కూడా అద్దె భవనమేనని స్పష్టం చేశారు.
తన పేరు చెప్పి ఎవరైనా భూ ఆక్రమణలు, దండాలకు పాల్పడితే తనకు సమాచారం ఇవ్వాలని, దీనికోసం అతి త్వరలోనే రెండు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే తగు విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీలయితే భవిషత్తులో భీమిలికి సమీపంలో నాలుగైదు ఎకరాల భూమి కొనుక్కొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తనువు చాలిస్తాను తప్ప మరొకటి కాదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.