Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ప్రజలంతా మీ కుటుంబసభ్యులేనని భావించినప్పుడే అది ‘భారత్‌ జోడో’ యాత్ర అవుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి సూచించారు. రాహుల్ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంకర్నాటక రాష్ట్రంలో ఈ యాత్ర కొనసాగుతోంది. నిన్న యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. తన కొడుకు తో పాటు ఆమె కొంత దూరం నడిచారు. ఈ సమయంలో సోనియా వేసుకున్న షూ లేస్ ఊడిపోతే దాన్ని రాహుల్ స్వయంగా ముడి బిగించారు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై విజయసాయి స్పందించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో అయన స్పందించారు.

“ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటక మండ్య జిల్లా బెళ్లాలె గ్రామంలో తన తల్లి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీ షూ లేసులు ఊడిపోతే కుమారుడు రాహుల్‌ గాంధీ గారు వాటిని సరిచేయడం నిన్నటి నుంచి ఆసక్తికర వార్తగా మారింది. గురువారం తన పాదయాత్రలో పాల్గొన్న తల్లి బూటు లేసులు కట్టడానికి రాహుల్‌ మోకాళ్లపై కూర్చుని పని పూర్తిచేశారు. ఈ కమనీయ దృశ్యం చూపరులకు కన్నీళ్లు పెట్టించలేదు కాని, లక్షలాది మంది మనసులకు హత్తుకుందని పత్రికలు తెలిపాయి. నిజమే, చాలా కాలంగా కొవిడ్‌ తదితర ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న సోనియా జీ తన కోసం వందలాది కిలోమీటర్లు విమానంలో ప్రయాణించి వచ్చి పాదయత్రలో తన వెంట నిలిచినందుకు కుమారుడు రాహుల్‌ ప్రేమతో తల్లి భుజంపై చేతులేసి కొద్ది దూరం నడవడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తించింది. ‘తల్లీకొడుకుల మధ్య ప్రేమ అంటే ఇలాగే కదా ఉండాలి’ అని వారికి అనిపించింది.

ప్రజలంతా తన కుటుంబ సభ్యులే అనుకుని ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లకు పైగా పరిపాలించారు దివంగత జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు. ఎక్కడ బహిరంగసభ పెట్టినా, ర్యాలీగా వెళ్లినా, రోడ్‌ షోలో కనిపించినా, ‘అమ్మా, అయ్యా, అక్కయ్యా చెల్లెమ్మ, తమ్ముడూ. అన్నయ్యా, తాతయ్యా అంటూ ప్రేమతో ప్రజలందరినీ వయసుతో నిమిత్తం లేకుండా పలకరించేవారు రాజన్న. అలాగే, తాను కన్నుమూసినా తెలుగు ప్రజలందరినీ తన కుమారుడికి కుటుంబ సభ్యులను చేశారు. ఇదే విధంగా, ‘యువనేత’ రాహుల్‌ జీ కూడా తన ప్రేమాభిమానాలను తన తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులకు పరిమితం చేయకుండా కోట్లాది మంది భారతీయులను తన కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటే బావుంటుంది. వయసు ఐదు పదుల నిండిన తర్వాత అయినా ఘనత వహించిన కుటుంబ వారసుడు రాహుల్‌ జీ తన చుట్టూ నిరంతరం నిలబడి ఉండే పార్టీ కార్యకర్తలు సహా ప్రజలందరినీ తన మాతృమూర్తి, ప్రియతమ చెల్లెలను చూసుకుంటున్నట్టే వారి బాగోగులు పట్టించుకుంటే జాతి గర్విస్తుంది. అప్పుడు దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన ‘అధికార’ నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత అంటే ఆరు (సోనియా, ప్రియాంక, రాహుల్, రాబర్ట్‌ వాడ్రా, రేహాన్, మిరాయా) అని కాకుండా 140 కోట్లు అని ప్రజల నుంచి జవాబు వస్తుంది. ప్రజానాయకుడు ఎవరైనా, ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినా తనకు కుటుంబం అంటే కేవలం తన భార్యా పిల్లలు, తల్లిదండ్రులు అక్కచెల్లెళ్లు తదితరులు మాత్రమే కాదని, తన పరివారం సమస్త ప్రజానీకం అని భావిస్తేనే– జనం ఆ నాయకుడికి అధికారం, తమ బాగోగులు చూసే బాధ్యతలను అప్పగిస్తారు. బహుళ రాజకీయపక్షాల ఉనికి తప్పనిసరి అయిన పార్లమెంటరీ ప్రజాతంత్ర వ్యవస్థలో ఆయా పార్టీల నేతలకు ప్రజలే వారి కుటుంబసభ్యులు. ఈ రాజకీయ స్పృహ ఉన్న నేతలు ప్రజల సంక్షేమమే తమ మార్గంగా ముందుకు నడుస్తారు. అదే ప్రజాక్షేత్రంలో నిజమైన పాదయాత్ర” అని విజయసాయి ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : పన్నుల వాటాలో అన్యాయం: విజయసాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com