Thursday, March 28, 2024
HomeTrending Newsచంద్రబాబు నాకు బంధువే: విజయసాయి

చంద్రబాబు నాకు బంధువే: విజయసాయి

తనను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ త‌న‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని., ఇది ఆపకపొతే.. ఇంతకు పదింతలు వారిపై దుష్ర్పచారం చేసే సత్తా తనకుందని వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తాను ఇంతవరకూ బాబు కుటుంబ సభ్యుల గురించి తాను మాట్లాడలేదని, రాజకీయ నాయకుల మీదే తాను విమర్శలు చేశానని గుర్తు చేశారు. పరిధులు దాటవద్దని, దాటితే తాము కూడా ధీటుగా సమాధానం చెప్పగలమని వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీపై, నేతలపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈడీ, సిబిఐ కేసుల్లో ఇరుక్కున క్వారీ ప్రమోటర్లు ఎవరని ప్రశ్నించారు విజయసాయి.

ఒక కంపెనీలో ఉన్న డైరెక్టర్ వేరే కంపెనీల్లో కూడా ఉండొచ్చని స్పష్టం చేశారు. దివీస్ ల్యాబ్ కిరణ్ తనకు బాగా సన్నిహితుడని, అతని కుటుంబంతో బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా సన్నిహిత సంబంధాలున్నాయని, అంతమాత్రానదివీస్ తనది అయిపోతుందా, లేక నారా, నందమూరి ఫ్యామిలీది అవుతుందా అని ప్రశ్నించారు. తన బంధువుల అమ్మాయిని తారకరత్న పెళ్లి చేసుకున్నాడని అంతమాత్రాన హెరిటేజ్ కంపెనీ తనది అయిపోతుందా అని ప్రశ్నించారు. వరుసకు చంద్రబాబు అన్న అవుతారని, బంధువులు అయినంత మాత్రాన వారి ఆస్తులు నావి, నా ఆస్తులు వారివి అయిపోవు కదా అని వ్యాఖ్యానించారు.

అడాన్ కంపెనీలో తనకు భాగస్వామ్యం ఉందంటూ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.  శ్రీనివాస్ అనే వ్యక్తి కాకినాడ ఎస్ ఈ జెడ్ లో, ఆడాన్ లో కామన్ డైరెక్టర్ గా ఉన్నాడని, అతనికి తనకు బినామీ అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లమూడి నాగరాజు అనే వ్యక్తికీ విహాన్ ఆటో వెంచర్స్ అనే కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నాడని, చంద్రబాబు హయాంలో అతనికి హైదరాబాద్ లో కియా మోటార్స్ డీలర్ షిప్ ఇప్పించాడని… ఇదే నాగరాజు హెరిటేజ్ కంపెనీల్లో డైరెక్టర్ గా కూడా ఉన్నారని విజయసాయి తెలిపారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలో నాగరాజు కామన్ డైరెక్టర్ గా ఉన్నాడని వివరించారు. శ్రీనివాస్ కు అప్లయ్ అయ్యే లాజిక్ నాగరాజుకు కాదా అని ప్రశ్నించారు. నంద్యాల విష్ణు రాజు హెరిటేజ్ లో డైరెక్టర్ అని, అతనే అమర్ రాజా బ్యాటరీలో కూడా డైరెక్టర్ అని.. అంటే అమర్ రాజా బ్యాటరీ కూడా బాబుదే అని తాను ఆరోపించావచ్చా అని నిలదీశారు. రత్న దుక్కిపాటి, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సాంబశివరావులు కూడా అదే విధంగా ఉన్నారని వివరించారు.  ఇప్పటికైనా బురద జల్లడం మానుకోవాలని, లేకపోతే ఇలాంటి ఉదంతాలు మరిన్ని బైటపెట్టాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Also Read : ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు: విజయసాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్