Sunday, January 19, 2025
HomeTrending NewsVirat kohli: కోహ్లీ రికార్డుల మోత - ఇండియా భారీ స్కోరు

Virat kohli: కోహ్లీ రికార్డుల మోత – ఇండియా భారీ స్కోరు

కింగ్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబై వాంఖేడే స్టేడియంలో నేడు జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ సెమి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసి… వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

విరాట్ 106 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స‌ర్ స‌హాయంతో 100 ర‌న్స్ చేసి సెంచ‌రీ సాధించాడు.

నవంబర్ 5 న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో సెంచరీ సాధించి వ‌న్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెర్టిన ఉన్న అత్య‌ధిక శ‌త‌కాల (49) రికార్డును విరాట్ సమం చేశాడు. నేటి సెంచరీ తో ఆ రికార్డును బద్దలు కొట్టి తన పేరిట చరిత్ర లిఖించుకున్నాడు. సచిన్ 463 మ్యాచ్ లలో ఈ ఘనత సాధించగా, కింగ్ కోహ్లీ 291 మ్యాచ్ ల్లోనే 50 సెంచరీ లు చేయడం విశేషం.

కోహ్లీ సాధించిన ఈ రికార్డుపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. కోహ్లీకి అభినందనలు  వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.  అదే స్టేడియంలో స్వయంగా మ్యాచ్ ను వీక్షించిన సచిన్… మ్యాచ్ విరామ సమయంలో విరాట్ ను హత్తుకొని అభినందించాడు.

ఈ రికార్డుతో పాటు ఒక సింగిల్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ 673 పరుగులతో సచిన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 711 రన్స్ తో మొదటి ప్లేస్ కు చేరుకున్నాడు.

కాగా 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేసి సౌతీ బౌలింగ్ లో కాన్వే పట్టిన క్యాచ్ కు కోహ్లీ వెనుదిరిగాడు.  శ్రేయాస్ అయ్యర్ మరోసారి ధాటిగా ఆడి, 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగులు చేసి ఔట్ కాగా; శుభ్ మన్ గిల్ 66 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80; కెఎల్ రాహుల్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కెప్టెన్ రోహిత్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి తొలి వికెట్ గా ఔటయ్యాడు. ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్