కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ మహమ్మద్ సిరాజ్ లను ఛార్టర్ ఫ్లైట్ లో దుబాయ్ చేర్చేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) జట్టు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిడియా సారధి కోహ్లీ, పేస్ బౌలర్ సిరాజ్ లు ఐపీఎల్ లో బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19 నుంచి పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ లో ఆడేందుకు తమ ఆటగాళ్ళు ఇద్దరినీ శనివారం రాత్రి ప్రత్యేక విమానం ద్వారా మాంచెస్టర్ నుంచి దుబాయ్ కు తీసుకు రానుంది. అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఆరు రోజులపాటు క్వారంటైన్ లో గడిపి తర్వాత బబూల్ లో ఉన్న జట్టుతో జత కలుస్తారు. ఈ విషయాన్ని ఆర్సీబీ జట్టు యాజమాన్యం ధృవీకరించింది.
ఐదు టెస్టుల సీరీస్ ఆడేందుకు విరాల్ కోహ్లీ సారధ్యంలోని భారత టెస్టు జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఇంగ్లాండ్ తో ఆఖరి, ఐదవ టెస్ట్ మొదలు కావాల్సి ఉంది, అయితే ప్రధాన కోచ్ రవి శాస్త్రి తో పాటు మరికొద్ది మంది సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో నిన్నటి మ్యాచ్ ఆడేందుకు ఇండియా జట్టు సభ్యులు విముఖత ప్రదర్శించారు. దీనితో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తో బిసిసిఐ సంప్రదింపులు జరిపింది. ఐదో టెస్టును రద్దు చేస్తూ ఇంగ్లాండ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ లో ఉన్న భారత ఆటగాళ్ళు అందరూ ఐపీఎల్ ఆడుతున్నారు. వీరందరినీ వీలైనంత త్వరగా దుబాయ్ తీసుకొచ్చేందుకు అటు బిసిసిఐ, మరోవైపు ఆయా జట్ల యాజమాన్యాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.