Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ నేడు జరిగిన మూడు మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ కు ఇది రెండో డ్రా మ్యాచ్ కావడం విశేషం.
యూ ముంబా – యూపీ యోధ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 28-28 తో డ్రా అయ్యింది. తొలి అర్ధ భాగంలో ముంబై 16-13 తో ఆధిక్యం సంపాదించింది. కానీ రెండో భాగంలో యూపీ 15-12తో పైచేయి సాధించింది. దీనితో మ్యాచ్ టై అయ్యింది. ముంబాయి ఆటగాడు అజిత్ ఆరు టచ్, మూడు బోనస్ తో మొత్తం తొమ్మిది పాయింట్లు సాధించాడు. యూపీ యోధ లో సురేందర్ గిల్ ఆరు టచ్, ఒక బోనస్, ఒక టాకిల్ తో మొత్తం 8పాయింట్లు సాధించాడు.
తెలుగు టైటాన్స్ – బెంగుళూరు బుల్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ కూడా 34-34 తో డ్రా గా ముగిసింది. ఆట తొలి భాగంలో బెంగుళూరు 14-12తో ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ 22-20 తో లీడ్ సాధించింది. దీనితో మ్యాచ్ డ్రా అయ్యింది. బెంగుళూరులో చంద్రన్ రంజిత్ మూడు టచ్, ఆరు బోనస్ తో 9; కెప్టెన్ పవన్ షెరావత్ మూడు టచ్; నాలుగు బోనస్, ఒక టాకిల్ తో మొత్తం 8 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్ లో అంకిత్ బెణివాల్ 10 టచ్ పాయింట్లు సంపాదించాడు.
దబాంగ్ ఢిల్లీ – తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మూడో మ్యాచ్ సైతం 30-30 తో డ్రా గా ముగిసింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ తొలి అర్ధ భాగంలో ఢిల్లీ 16-14 తో స్వల్ప ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధభాగంలో తమిళ్ తలైవాస్ 16-14 తో లీడ్ సాధించింది. దీనితో మ్యాచ్ డ్రా అయ్యింది. ఢిల్లీ ఆటగాడు నవీన్ కుమార్ పదమూడు టచ్, రెండు బోనస్ లతో మొత్తం 15; తమిళ్ ఆటగాడు మన్ జీత్ నాలుగు టచ్, ఐదు బోనస్. ఒక టాకిల్ తో మొత్తం 10 పాయింట్లు సాధించారు.
ఢిల్లీ 21 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగుళూరు బుల్స్(18); యూ ముంబా(17); పాట్నా పైరేట్స్ (16); తమిళ్ తలైవాస్ (14); యూపీ యోధ (13) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.