Wednesday, June 26, 2024
HomeTrending NewsVizag Steel: కేంద్రం ప్రకటన దృష్టి మరలించే చర్య - కేటిఆర్

Vizag Steel: కేంద్రం ప్రకటన దృష్టి మరలించే చర్య – కేటిఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన నామమాత్రపు ప్రకటన కేవలం దృష్టి మరలించే చర్యగా మంత్రి కే. తారకరామారావు అభిప్రాయపడ్డారు. కేవలం అదానీకి చత్తీస్ గఢ్, ఒరిస్సాలోని బైలదిల్లా మైన్స్ అక్రమ కేటాయింపుల నుంచి దృష్టి మరలించేందుకు చేస్తున్న ప్రయత్నమని అన్నారు. నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతంపైన చిత్తశుద్ధి ఉంటే దానికి వెంటనే డెడికేటెడ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ గనులను కేటాయించి, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు.. తెలంగాణ ప్రజల హక్కు అయిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గొడ్డలిపెట్టుగా మారిన అదానీ… బైలదిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కుట్రపూరిత వైఖరిని తాము బయట పెట్టిన నేపథ్యంలోనే కేంద్రం ఈ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా ..కేంద్రం కుట్రలు చేసిన తీరు పైన భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధిని చాటుకుంటూ.. మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొంటామని చేసిన ఒక్క ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం వెనక్కి తగ్గిందని కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకునే దాకా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే దాకా కేంద్ర ప్రభుత్వం పైన నిరంతరం ఒత్తిడి పెంచుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్