విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నేడు, రేపు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తమ వాణి బలంగా వినిపించేందుకు ఈ ధర్నా కార్యక్రమం తలపెట్టారు. దీనికోసం వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హస్తినకు తరలి వెళ్ళారు. అయోధ్యరామ్, ఆదినారాయణ, రాజశేఖర్ పలువురు కార్మిక నేతలతో కలిసి విశాఖ ఎంపీ సత్యనారాయణ, తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితరులు ఢిల్లీ వెళ్ళినవారిలో వున్నారు.
మరోవైపు శనివారం రాత్రి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరిన వందలాది మంది ఉక్కు కార్మికులు ఢిల్లీ కి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉక్కు కార్మికుల నినాదాలతో దువ్వాడ స్టేషన్ దద్దరిల్లింది. 32 మంది అమర వీరుల త్యాగఫలం విశాఖ ఉక్కు అని ఈ సందర్భంగా కార్మికులు గుర్తు చేసుకున్నారు. 64 గ్రామాల నిర్వాసితులు 26వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని నినదించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. తెలుగు ప్రజల ఉద్యమ స్ఫూర్తిని చాటి చెబుతామని స్పష్టం చేశారు. నేడు, రేపు ధర్నాలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులను కూడా కార్మిక సంఘం నేతలు కలవనున్నారు.