విశాఖ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయడంలో భారత బ్యాట్స్ మెన్ తడబడి 255 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శుభ్ మన్ గిల్ సెంచరీ తో సత్తా చాటాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.
మొత్తంగా 399 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి67 పరుగులు చేసింది. ఇంకా ౩౩2 పరుగులు చేయాల్సి ఉంది.
రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులతో నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఇండియా రెండు పరుగుల తేడాలోనే ఓపెనర్లు ఇద్దరి వికెట్లూ (రోహిత్ శర్మ-13; జైస్వాల్-17) కోల్పోయింది. మూడో వికెట్ కు గిల్-శ్రేయాస్ అయ్యర్ లు 81 పరుగులు జోడించారు. అయ్యర్ 29; పటీదార్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదో వికెట్ కు గిల్- అక్షర్ పటేల్ లు 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 1౦4 పరుగులు చేసిన గిల్ ఐదో ఔటయ్యాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ (45) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే 29 పరుగులు చేశాడు. 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్ లీ 4; రెహాన్ అహ్మద్ 3; జేమ్స్ అండర్సన్ 2; బషీర్ ఒక వికెట్ సాధించారు.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ తొలి వికెట్ కు 50 పరుగులు చేసింది. డక్కెట్ 28 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. జాక్ క్రాలే 29; రెహాన్ అహ్మద్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.