Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకండిగ్రీ పట్టా... చేతిలో దర్భ!

డిగ్రీ పట్టా… చేతిలో దర్భ!

రాజస్థాన్ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త. చదువు అంటే కేవలం కంప్యూటర్లో కోడింగ్ రాయడమే కాదు, మన పురాణాల్లోని ‘కోడ్’ను డీకోడ్ చేయడం కూడా అని కోటా వర్సిటీ నిరూపిస్తోంది.

ఏమిటీ కోర్సు? ఎందుకీ ఉత్సాహం?

సాధారణంగా డిగ్రీ అంటే బీఏ, బీకాం అనుకుంటాం. కానీ రాజస్థాన్‌లోని వర్ధమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ (VMOU) మాత్రం ‘కర్మకాండ’ కోర్సు అంటోంది. 12వ తరగతి పాసైతే చాలు.. చేతిలో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే చాలు.. మీరు కూడా శాస్త్రీయంగా ‘కర్మకాండ’ నేర్చుకోవచ్చు. అడ్డంకులు లేవు, వయసు పరిమితులు లేవు. అసలు విషయం ఏమిటంటే.. సీట్లు అపరిమితం! అంటే నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ, వర్సిటీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

షోడశ సంస్కారాలు…సిలబస్ అంశాలు

మన హిందూ ధర్మంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 16 రకాల సంస్కారాలు (షోడశ సంస్కారాలు) ఉన్నాయి. నామకరణం నుంచి వివాహం వరకు అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఈ రోజుల్లో చాలామందికి మంత్రం అర్థం కాదు, తంత్రం తెలియదు. పంతులు గారు ఏదో చెబుతారు, మనం ఏదో చేస్తాం. కానీ ఈ ఆరు నెలల కోర్సు పూర్తి చేస్తే, ఆ మంత్రాల వెనుక ఉన్న పరమార్థం ఏమిటో బోధపడుతుంది. పెళ్లిలో ఏడు అడుగుల ప్రాముఖ్యం ఏమిటో, హోమంలో వేసే సమిధల విశిష్టత ఏమిటో శాస్త్రీయంగా తెలుస్తుంది.

కుల మతాలకతీతంగా సంప్రదాయ విజ్ఞానం

ఈ కోర్సులో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఇక్కడ కుల ప్రస్తావన లేదు. మత నిబంధన లేదు. సంప్రదాయం మీద గౌరవం ఉండి, నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు. డిజిటల్ యుగంలో సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్న ఆందోళన ఉన్న తరుణంలో, యూనివర్సిటీ స్థాయిలోనే ఇలాంటి కోర్సులు రావడం విశేషం.

‘సంస్కారాల’ చదువు

చదువు అంటే కేవలం ఉద్యోగం కోసమే కాదు, సంస్కారం నేర్చుకోవడం కోసం కూడా అని ఈ కోర్సు గుర్తు చేస్తోంది. సంప్రదాయం అంటే చాదస్తం కాదు, అది మన జీవన విధానం. కోటా వర్సిటీ వేసిన ఈ అడుగు రేపు మరిన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకం కావచ్చు. రేప్పొద్దున మన ఇంటి వేడుకలో ఈ కర్మకాండ కోర్స్ పూర్తి చేసిన ఒక యువ గ్రాడ్యుయేట్ మంత్రాలు చదువుతూ, వాటి అర్థాలు వివరించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular