గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు కనెక్టివిటి పెంచడంతో పాటు రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో రూ. 27.43 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 లింక్ రోడ్లను విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలతో కలిసి కె.టి.రామారావు నేడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ ప్రసంగిస్తూ…. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్ లో దేశంలోని మరే మెట్రో నగరాల్లో లేనివిధంగా లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యమని, అభివృద్ది సూచికలుగా నిలిచే రహదారుల అభివృద్దిలో భాగంగా రూ. 6వేల కోట్ల వ్యయంతో ఎస్.ఆర్.డి.పి ప్రాజెక్ట్, రూ. 1800 కోట్ల వ్యయంతో సి.ఆర్.ఎం.పి ప్రాజెక్ట్ ల ద్వారా పలు రహదారుల అభివృద్ది, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 16 లింకు రోడ్లను పూర్తి చేశామని, వీటితో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు.
హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద అదనంగా మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. దశలవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.