సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణను తెలుగు కవులు, రచయితలు తెలంగాణ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, శాసన సభ మాజీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ, కవి ఎన్. గోపి, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్ సహా పలువురు రచయితలు, కవులు జస్టిస్ రమణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన సీజేఐని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. తెలుగు భాషను ఎంతో అభిమానించే జస్టిస్ ఎన్వీ రమణ అత్యున్నత పదవి చేపట్టడం తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిందని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సీజేఐ చేసిన సేవలను బుద్ధ ప్రసాద్ కొనియాడారు.
తిరుపతి కధలు పుస్తక ఆవిష్కరణ:
ఈ సందర్భంగా ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో వారు ప్రచురించిన “తిరుపతి కధలు” పుస్తకాన్ని ఎన్వీ రమణ ఆవిష్కరించారు.