Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఐసీఎంఆర్ ఇండియా విశ్లేషణ

ఐసీఎంఆర్ ఇండియా విశ్లేషణ

 In our Hands: ప్రస్తుతం సమాజంలో డయాబెటిస్ బారిన పడి జీవితాంతం మందులు వాడాలని బాధపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ బారిన పడినవారు మధుమేహం నుంచి పూర్తిగా బయటపడవచ్చునని భారతీయ వైద్య పరిశోధన సంస్థ డయాబెటిస్ పై చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికిపైగా తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రొటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధి శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని ఐసీఎంఆర్ ఇండియా పేర్కొంది.

డయాబెటిస్ పై అధ్యయనం:  రివర్స్ చేసే ప్లాన్ లో కీ రోల్ ఆహారానిదే… అంతేకాదు ప్రీ-డయాబెటిక్ అయితే, అన్నం, రోటీలను బాగా తగ్గించి, ప్రోటీన్ డైట్ పెంచుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్‌ను ఆపవచ్చు అని పేర్కొంది. డయాబెటిస్ పై దేశంలో జరుగుతున్న అతిపెద్ద అధ్యయనం ప్రకారం, దానిని రివర్స్ చేయవచ్చు. రోజువారీ వినియోగించే శక్తిలో కార్బోహైడ్రేట్ వినియోగాన్ని కేవలం 50-55 శాతానికి తగ్గించాలని, ప్రోటీన్ తీసుకోవడం 20 శాతానికి పెంచాలని అధ్యయనం సిఫార్సు చేస్తోంది.

2045 నాటికి భారతదేశంలో 135 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్థులు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఇండియా డయాబెటిస్ తాజా నివేదిక 18,090 మంది వ్యక్తుల వివరణాత్మక స్థూల-పోషక వినియోగ నమూనా అధ్యయనంపై ఆధారపడింది. డయాబెటిస్ ను రివర్స్ చేయడానికి ఆహారం ఉత్తమ ఔషధంగా అధ్యయనం తేల్చింది. భారతదేశంలో మధుమేహం అతి పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది.

ప్రస్తుతం మన దగ్గర 74 మిలియన్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారు . మరో 80 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిక్ గా ఉన్నారు. అలాగే, ప్రీ-డయాబెటిక్స్ చాలా వేగంగా డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంటుంది. 2045 నాటికి భారతదేశంలో 135 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారని అంచనా. అంటే వచ్చే 20 ఏళ్లలో దాదాపు రెట్టింపు.

భారతదేశంలో చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్ వినియోగం డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణం అని అధ్యయనం చేసిన నిపుణుల బృందం తేల్చింది. మన మొత్తం క్యాలరీలలో 60 నుండి 75 శాతం కార్బోహైడ్రేట్ల రూపంలో ఉంటుంది. 10 శాతం మాత్రమే ప్రోటీన్లను కలిగి ఉంటుంది. వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఇంతకుముందు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇక గోధుమలు కూడా సమానంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు, ఒక వ్యక్తి కార్బోహైడ్రేట్ వినియోగాన్ని 50 నుండి 55 శాతానికి తగ్గించగలిగితే, ప్రోటీన్ వినియోగాన్ని పెంచగలిగితే ప్రధానంగా మొక్కల ప్రోటీన్, చేపలు, చికెన్ వంటి వాటిని పెంచితే మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు.

డయాబెటిస్ రివర్స్ చెయ్యటానికి అధ్యయనం తేల్చిన ప్రణాళిక ఇదే

  • డయాబెటిస్ ను రివర్స్ చేయడానికి సరైన ప్రణాళిక ప్రకారం కార్బోహైడ్రేట్లు వినియోగాన్ని తగ్గించి ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, దానికోసం ప్రాణాయామ, మెడిటేషన్ వంటి వాటిని చేయడం ఉపయోగపడతాయని  అధ్యయనం వెల్లడించింది.
  • రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటు నిద్ర పోవాలని, నిత్యం 45 నిమిషాల పాటు వాకింగ్ తప్పనిసరి అని అధ్యయనం సూచించింది.
  • రోజూ శరీర బరువును బట్టి 3 నుంచి మూడున్నర లీటర్ల నీళ్లు తాగాలి అని, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి దీని నుంచి మినహాయింపు ఉందని అధ్యయనం పేర్కొంది. విటమిన్ డి తక్కువైనా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి విటమిన్-డి వాడడం వల్ల దీనిని నియంత్రించవచ్చని పేర్కొంది.

చిన్న చిన్న జీవన శైలి మార్పులతో మధుమేహానికి శాశ్వతంగా చెక్

  • స్మోకింగ్ అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా దాన్ని మానేయాలని వెల్లడించింది.
  • ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కూరగాయలు, ఫైబర్, ప్రోటీన్, మంచి ఫ్యాట్ లను తీసుకోవాలని ఆహార పరిమాణాన్ని తగ్గించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోకూడదని, స్వీట్లు మానేయాలని అధ్యయనం వెల్లడించింది.

ఈ చిన్న చిన్న మార్పులతో జీవితాంతం మందులు వేసుకునే బాధ నుండి, మధుమేహం సమస్య నుండి శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చని, డయాబెటిస్ ను రివర్స్ చేయొచ్చని అధ్యయనం పేర్కొంది.

Also Read :

ఆధునిక తీర్థ ప్రసాదాలు

Also Read :

మనం మారాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్