వాలంటీర్ వ్యవస్థను తాము తొలగించబోమని కానీ వారు వైఎస్సార్ పార్టీ దొంగలుగా పనిచేయవద్దని, వాలంటీర్లలో కూడా తెలివైన వారు ఉన్నారని…వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మంచి భవిష్యత్తు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. తన మాటగా ఈ విషయాన్ని వాలంటీర్లకు చెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. పెనుగొండకు కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, ఈ కంపెనీ కోసం 18 నెలల్లో గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించామని వెల్లడించారు. కియా ద్వారా 50 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని… ఈ కంపెనీ రాకముందు ఈ ప్రాంతంలో ఎకరా 2 లక్షల రూపాయలు ఉంటే ఇప్పుడు ఎకరా రెండు కోట్ల రూపాయలవరకూ ధర పెరిగిందని, తాము కొనసాగి ఉంటే ఐదు కోట్ల రూపాయల వరకూ పెరిగేదని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో హార్టీ కల్చర్ ను ప్రోత్సహించామని, ప్రపంచంలో ఉన్న పండ్ల తోటలన్నీ అనంతపురంలో ఉన్నాయని తెలిపారు. పెనుగొండలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో బాబు పాల్గొని ప్రసంగించారు. వైఎస్ హయంలో ఈ ప్రాంతంలో మొదలు పెట్టిన నాలెడ్జ్ హబ్ లో భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు.
సిఎం జగన్ తన అహంకారంతో బంగారంలాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం-జన సేన పార్టీలు తమ స్వార్ధం కోసం కలవలేదని… రాష్ట్రాన్ని కాపాడడానికి పొత్తు పెట్టుకున్నామని స్పష్తం చేశారు. అనంతపురం జిల్లాలో విండ్, సోలార్ పవర్ ను ప్రోత్సహించామని, గత ఐదేళ్ళ కాలంలో జిల్లాలో అనేక పరిశ్రమల స్థాపనకు కృషి చేశామని… కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కంపెనీలు పారిపోయాయని పేర్కొన్నారు.
ఇటీవలే జగన్ ఈ ప్రయత్నంలో సిద్ధం సభ నిర్వహించాడని… కానీ ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల విషయం గానీ, ఈ ప్రాంతంలో పరిశ్రమల గురించి గానీ ఒక్కమాట కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు. తన హయంలో ఐటి ఉద్యోగాలు ఇప్పిస్తే జగన్ పాలనలో మటన్ షాపులో, మద్యం షాపులో, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగాలు ఇప్పించారని ఫైర్ అయ్యారు.