Monday, April 15, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెద్దవారి కొద్ది బుద్ధులు

పెద్దవారి కొద్ది బుద్ధులు

కలవారి పెళ్లిళ్లలో భోజనం దొరకని అవస్థల మీద మొన్న రాసిన కథనమిది:-

మింగ మెతుకు లేదు

దీనికి స్పందిస్తూ చాలా మంది వారి వారి అనుభవాలను పంచుకున్నారు. సంఘంలో పెద్దవారి గురించి బహిరంగంగా చర్చించడం మర్యాద కాదు కాబట్టి- అవన్నీ ఇక్కడ అనవసరం. “ఇంట్లో లాన్లో చుట్టూ సేవకులు ఉండగా పచ్చి గడ్డి మీద ఒంటరిగా కూర్చుని చేతిలో ఫ్రూట్స్ బౌల్ పట్టుకుని తింటూ…ఎదుటివాడిని కనీసం కూర్చోమని కూడా చెప్పని…ఎండలో చెమటలు కక్కుకుంటూ వచ్చినవాడికి కనీసం మంచి నీళ్లు కూడా ఇప్పించని పెద్దమనిషి…వేల మంది వచ్చే పెళ్లి పందిట్లో మెతుకులు పెడతాడని ఎలా అనుకుంటాం?” లాంటివి ఆ స్పందనల్లో పేర్లతోపాటు ఎన్నో ఉన్నాయి.

ఉన్నవారి పందిట్లో అవమానాలు తలుచుకోవడం కంటే….లేనివారి వాకిట్లో దొరికిన అతిథి మర్యాదల అమృతం గురించి తలచుకోవడం మంచిది.

మా డ్రైవర్ బాషా పెద్దమ్మాయి పెళ్లికి నేను, నా భార్య, మా అబ్బాయి విజయవాడ వెళ్లాము. బండలు పగిలే బెజవాడ ఎండా కాలం. మిట్ట మధ్యాహ్నం. కారు కూడా లోపలికి వెళ్లని చిన్న ప్రభుత్వ కమ్యూనిటీ హాల్. కిక్కిరిసిన హాల్లో ఫ్యాన్ కింద మూడు కుర్చీలు ఖాళీ చేయించి మమ్మల్ను కూర్చోబెట్టాడు. అందరినీ పరిచయం చేయించాడు. నిఖా అయ్యాక హాల్లో పైన మాకోసం శాకాహార భోజనం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. పెరుగన్నం తినేవరకు ఉండి…కొసరి కొసరి వడ్డించాడు. పక్కన ఎక్కడో మసీదుకెళ్ళి నిఖానామా పత్రం తీసుకురావాలి వెళ్ళు అని పెళ్లిపెద్దలు వెంటపడుతున్నా…మా భోజనాల గురించే ఆలోచిస్తున్నాడు. కింద అంతా నాన్ వెజ్…అందుకు పైన విడిగా పెట్టాల్సి వచ్చింది…అని వివరణ ఇచ్చుకున్నాడు. ఇంకాసేపు అక్కడే ఉండాలని మాకు ఉన్నా…అతను మిగతావారిని పట్టించుకోడని…అది మాకు మర్యాద కాదని వెంటనే వచ్చేశాము. తరువాత రోజు అన్నం బాగుందా? అని బాధ్యతగా అడిగాడు. అక్కడ ఏమి తిన్నామో గుర్తు లేదు కానీ…అతడి ప్రేమతో అది అమృతమయమై…ఏ పెళ్లికి వెళ్లినా అదే గుర్తొస్తూ ఉంటుంది.

ఇలాంటిదే మరో అమృతాన్నం.
మా ఊరి మొలకల పండగ- ‘తీజ్’ కు రావాలని మా ఇంటి సహాయకులు శారద, కవిత పట్టుబట్టారు. ఎన్నో ఏళ్లుగా మా ఇంటిని చూసుకునేవారు ఆప్యాయంగా పిలిస్తే నా భార్య కాదనలేకపోయింది. ఆదివారం లాంగ్ డ్రయివ్ లా ఉంటుందని బయలుదేరాము. హైదరాబాద్ నుండి 80 కిలోమీటర్ల దూరం. రెండు గంటలు పోను – రెండు గంటలు రాను ప్రయాణం. శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూల్ జిల్లా అమనగల్ దాటాక వెల్దండ దగ్గర వారిది మహాత్మా గాంధీ తాండా. 1500 జనాభా ఉండవచ్చు. ఊరంతా లంబాడీలే.

వెల్దండ దాటగానే తాండాల్లో పండగ రంగులు కనువిందు చేస్తున్నాయి. కదిలే వాహనాల్లో డి జె ల మోత మోగిపోతోంది. గవ్వలతో కుట్టిన వస్త్రాలతో లంబాడీలు గాల్లో తేలుతున్నారు.

ప్రతి ఇంటికి బంధువులు రావడంతో అదనపు వసతి కోసం షామియానాలు వేశారు. ప్రతి ఇంటి ముందు యాటలు కోస్తున్నారు. రాళ్లు పేర్చి కట్టెల పొయ్యిల మీద పెద్ద పెద్ద పాత్రల్లో మటన్ వండుతున్నారు.

రోజూ అన్నం వండి పెట్టే కవిత ఇంటికి ముందు వెళ్లాం. ఆపై కాస్త దూరంలో ఉన్న శారద ఇంటికి వెళ్లబోయాము. ఇంటి గేటుకు నిచ్చెన పెట్టారు. ఆ నిచ్చెనకు వేలాడదీసిన జంతువు మాంసం కోస్తున్నారు. మమ్మల్ను రోడ్డు మీదే కాసేపు ఆపి...ఆ మాంసం కొట్టుడు సీన్ ను మరో చోటికి మార్చి…నీళ్లతో కడిగి మమ్మల్ను సాదరంగా లోపలికి ఆహ్వానించారు.

శారద టీ పెట్టి ఇచ్చింది. మధ్యాహ్నం మాకోసం ప్రత్యేకంగా పప్పు, అన్నం వండింది. పెరుగు తెప్పించింది. భోంచేసి తీజ్ ఊరేగింపులో పాల్గొని…ఇంటిదారి పట్టాము. లంబాడీలు/గిరిజనులకు తీజ్ పండగ ఎందుకు ముఖ్యమో చెప్పారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు చేసే ఒక ఉత్సవమిది. మంచి భర్త దొరకాలని ఈ సంప్రదాయం ఎప్పటినుండో ఉన్నట్లుంది.

శ్రావణ మాసానికి ముందు వెదురు బుట్టలో మట్టి వేసి…ఆ మట్టి మీద గోధుమ గింజలు చల్లుతారు. రోజూ నీళ్లు చల్లుతూ ఉంటే…అవి మొలకెత్తుతాయి. తొమ్మిదో రోజు ఆ మొలకెత్తిన బుట్టలను నెత్తిన పెట్టుకుని ఊరంతా ఉరేగింపుగా వెళ్లి..బతుకమ్మను నీళ్లల్లో వదిలినట్లు చెరువులో వదిలి వస్తారు. తీజ్ ఊరేగింపు అయ్యాక మందు- ముక్కకు లెక్క ఉండదు.

ఊరి జనంతో పాటు తీజ్ మొలకల బుట్టలతో మేము కూడా ఫోటోలు దిగాము. తీజ్ ఉరేగింపులో ఆకాశానికి చిల్లులు పడే డి జె సౌండ్ల మధ్య నృత్యాలను చూశాము.

కవిత, శారద ఇద్దరూ కష్టజీవులు. వారి తాండాలో వారు కొత్తగా కట్టుకుంటున్న ఇళ్లను మాకు చూపిస్తున్నప్పుడు వారు పొందిన ఆనందం మాటల్లో చెప్పలేము. ఎంత చెట్టుకు అంత గాలి. ఏళ్లతరబడి అహోరాత్రాలు కష్టపడి పని చేసే వారు ఉన్న ఊళ్లో ఒక గూడు కోసం ఎన్నెన్ని కలలు కన్నారో? ఎన్నెన్ని అప్పులు చేశారో?

“పోతనార్యుని గేహమున భారతీదేవి చిగురు చేతుల వంట చేయునాడు…”
అని బమ్మెర పోతన ఇంట్లో సరస్వతీదేవి ఇష్టంగా వంట చేసి పెట్టేదని…అందుకే పోతన కవితకు అంతటి మహిమ అని గుర్రం జాషువా అన్నాడు. అలా శారద, కవితలు మా ఇంట్లో సారస్వతాన్ని వండుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది.

మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం రాని…పని మానేసి..వారి కలలకు ప్రతిరూపంగా కట్టుకుంటున్న ఇంట్లో వారు హాయిగా ఉండే రోజు రావాలన్నది మా కోరిక.

ఎంత కలిమి ఉన్నా…పెట్టే మనసులేనివారు లేనివారు.
ఎంత లేమిలో ఉన్నా…ఉన్నంతలో ప్రేమతో పెట్టగలిగినవారే ఉన్నవారు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్