Monday, April 15, 2024
HomeTrending Newsకాంగ్రెస్ - బీఆర్ఎస్ రెండు ఒక్కటే - ప్రధాని మోడీ

కాంగ్రెస్ – బీఆర్ఎస్ రెండు ఒక్కటే – ప్రధాని మోడీ

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆదిలాబాద్ లో సోమవారం రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేయటంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరాజన్, సిఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు.

ఆ తర్వాత బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్, బీఆర్ఎస్ ల విధానాలపై చురకలు అంటించారు. రెండు పార్టీలు కుటుంబ పార్టీలే అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు తిన్నారంటే మీరు తిన్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్‌ భారత్‌ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

అంతకుముందు మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి… విభజన హామీ మేరకు NTPC 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వ ధోరణితో కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు.

సెమీ కండక్టర్ ఇండస్ర్టీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో, మూసీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల తమ ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్ పట్టణం సోమవారం ఆసక్తికర సన్నివేశానికి వేదికగా మారింది. కాంగ్రెస్ పాలనలోని ఇతర రాష్ట్రాల సిఎంలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ తనకు పెద్దన్న లాంటి వారని, ఆయన సహకారం, ఆశీస్సులు ఉంటే తెలంగాణని మరో గుజరాత్ గా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. సభ జరుగుతున్నంత సేపు ప్రధాని-ముఖ్యమంత్రుల మధ్య సంభాషణ కొనసాగింది.

రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ సభలో వ్యవహరించిన తీరుపై హర్షం వ్యక్తం అవుతోంది. ప్రధానికి స్వాగతం పలికి… రాష్ట్ర అభివృద్ధి కోసం విజ్ఞప్తి చేయటం బాధ్యత అని గతంలో కెసిఆర్ ఇలా వ్యవహరించి ఉంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి మరిన్ని ప్రాజెక్టులు వచ్చి ఉండేవని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఈ సభలో ఎంపి సోయం బాపురావు పరిస్థితి భిన్నం. ఎంపిలలో తన సహచరులు ముగ్గురికి మొదటి జాబితాలో పేర్లు ప్రకటించగా తన పేరు లేకపోవటం… జాబితా ప్రకటించిన రెండు రోజుల్లోనే ఆదిలాబాద్ సభకు ప్రధాని రావటం జరిగింది. సభ ఆసాంతం ఎంపి బిక్క మొహం వేసుకొని కాలం వెళ్లదీయాల్సి వచ్చింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్