Sunday, September 8, 2024
HomeTrending NewsWorld Fisheries Day: అది మా చిత్తశుద్ధికి నిదర్శనం: సిఎం జగన్

World Fisheries Day: అది మా చిత్తశుద్ధికి నిదర్శనం: సిఎం జగన్

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఘటనపై సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలిచామని, మత్స్యకారుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  “40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే వెంటనే వాళ్లని ఆదుకోవాలని తపన, తాపత్రయం పడ్డాం. వాటికి ఇన్సూరెన్స్‌ ఉందా ? లేదా ? అని విచారణ చేశాం. ఇన్సూరెన్స్‌ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదని.. వాళ్లకు మేలు చేయాలని, ప్రతి బోటు విలువ లెక్కగట్టమని చెప్పాం. ఆ బోటుకు సంబంధించి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది” అని వెల్లడించారు.

ఓఎన్జీసీ సంస్ధ పైప్‌లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని సిఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వర్చువల్‌గా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా… ఒక మంచి కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నామని, వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని తెలిపారు. కానీ  తాము ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్‌ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు.

తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్‌ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి కూడా నేడు శ్రీకారం చుట్టాలనుకున్నామని, కానీ పర్యటన రద్దు కావడంతో చేయలేకపోయామని, వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని హామీ ఇచ్చారు.

మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి అధికారులు, లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్