Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపొగడరా నీ తల్లి భూమి భారతిని

పొగడరా నీ తల్లి భూమి భారతిని

“శ్రీలు పొంగిన జీవ గడ్డయి
పాలు పారిన భాగ్య సీమయి
వ్రాలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా!
వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా!
విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపులతత్త్వము విస్తరించిన
విమలతల మిదె తమ్ముడా!
సూత్ర యుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్రదాస్యముచే చరితలు 
చెఱిగిపోయెను
చెల్లెలా!
మేలికిన్నెర మేళవించీ
రాలు కరగగ రాగమెత్తీ
పాలతీయని భావిభారత
పదము పాడర తమ్ముడా!
నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన క్రాంతహృదయుల
గారవింపవె చెల్లెలా!
దేశగర్వము దీప్తిచెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా!
పాండవేయుల పదును కత్తులు
మండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా!
లోకమంతకు కాకపెట్టిన
కాకతీయుల కదన పాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చి పాడర తమ్ముడా!
తుంగభద్రాభంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళీ
భంగపడని తెలుంగునాధుల
పాట పాడవె చెల్లెలా!”

రాయప్రోలు సుబ్బారావు(1892-1984) తెలుగులో భావకవిత్వానికి ఆద్యుడు. తెలుగు కవితకు కొత్త సొగసులు అద్దినవాడు. అనేక దేశభక్తి గీతాలు, తెలుగు వైభవ గీతాలు రాసినవాడు. సంస్కృతం బాగా చదివినా కండగల తెలుగుకోసం పరితపించినవాడు. ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాయప్రోలు దేశభక్తి గేయం ప్రస్తావన.

నిజానికి ఈ పాటకు అర్థ వివరణ అంతగా అవసరం ఉండదు. జనం నోళ్ళల్లో దశాబ్దాలుగా బాగా నలిగిన పాట. కొత్త తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఇదివరకు బడుల్లో జాతీయ దినోత్సవాల్లో పిల్లలచేత పాడించేవారు. ఇప్పటి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లకు ఈ శ్రీలు పొంగిన చెబితే హౌ ఐ వండర్! వాట్ యూ ఆర్? అని ఇంగ్లిష్ అయోమయంలో ఆశ్చర్యపోతారు. చదవడంకంటే ఈ రచనను పాటగా పాడితేనే అందం.

భావం:-

సిరిసంపదలు పొంగిన భూమి. పాలతో అభిషేకించిన భూమి.
వేదాలు వెలసిన భూమి. ఆదికావ్యం రామాయణం పుట్టిన భూమి. పరమ రుషులకు ఆలవాలమైన భూమి.
ఙ్ఞానారణ్యాల చెట్ల కొమ్మలకు ఉపనిషత్తుల మధువులు చిప్పిల్లిన భూమి.
గౌతమ సూత్రాలు, ఆపస్తంభ సుత్రాల శుద్ధవాసనలు, శౌర్యప్రతాపాలు చరిత్రలో కలిసిపోయిన భూమి.

ఆ మహోన్నత వారసత్వాన్ని తలచుకుంటూ…మేలి కిన్నెర మేళవించి…రాళ్ళు కరిగేలా ఆ సముజ్వల వైభవ గీతులను ఇప్పుడు పాడుకోవాలి.
నవరసాలు నాట్యమాడేలా, పలుకు పలుకులో తేనె చిలికేలా కవితలల్లిన క్రాంతదర్శులను తలచుకుని…తలచుకుని పొంగిపోవాలి.
దేశగర్వం వెలిగేలా…దేశచరిత పులకించేలా వినుతికెక్కిన జాతీయనాయకుల గురించి పదే పదే తెలుసుకోవాలి.
పాండవులు కత్తి కడిగి శత్రువుల పీచమణచిన మహాభారత కథను తెలుగులో కవిత్రయ కవితాధారలో చదువుకుని పులకించిపోవాలి.
యుద్ధరంగంలో మెరిసిన కాకతీయుల కత్తికి తెగిన శత్రువుల కుత్తుకల గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి.
తుంగభద్ర తరంగాలలో అలలు అలలుగా ఆకాశందాకా ఎగసిపడే తెలుగు చరితలను గొంతెత్తి పాడుకోవాలి.

“ఏ దేశమేగినా
ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా
ఎవ్వరెదురైనా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

ఏ పూర్వపుణ్యమో
ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో నినుమోసె ఈ తల్లి కనక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవి యెందు లేరురా మనవంటి పౌరులింకెందు”

2025 ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular