Friday, November 22, 2024
HomeTrending Newsసంక్షేమం కొనసాగాలంటే మనమే రావాలి : జగన్

సంక్షేమం కొనసాగాలంటే మనమే రావాలి : జగన్

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి  రావాలని, రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని… ఇదే విషయాన్ని పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజలకు వివరించి చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనర్లు సహా పలువురు నేతలు హాజరయ్యారు.

“పొరపాటున మనం జగన్‌కు కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కానీ ఓటు వేయకపోతే.. అది జరిగితే  వాలంటీర్లు వ్యవస్ధ మాకు వద్దు, మళ్లీ జన్మభూమి కమిటీలు కావాలని మనంతట మనమే సంతకం పెట్టినట్టే. మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తూ… ప్రతినెలా సంవత్సరం పొడువునా .. ఏ పథకం ఎప్పుడు వస్తుందో షెడ్యూల్‌ ఇచ్చి, క్యాలెండరు ఇచ్చి అమలు చేస్తున్న పథకాలన్నీ మనంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చినట్టే. మళ్లీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. మరలా ఎవ్వడూ పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఎక్కడా ఉండదు. మళ్లీ పేదవాడి బ్రతుకు చిన్నాభిన్నమే అన్న సంకేతం ప్రతి ప్రతిపేదవాడి ఇంట్లోనూ వెళ్లాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి” అంటూ కర్తవ్య బోధ చేశారు.

ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకు ఉన్న ప్రతి కార్యకర్త తమ నాయకుడ్ని చూపించి అదిగో అతడే మా నాయకుడు అని కాలర్‌ ఎగరేసి చెప్పే విధంగా ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు.  కేడర్‌ గ్రామస్ధాయిలో ఇంటింటికీ వెళ్లినప్పుడు వారికి కూడా ఆ గౌరవం లభిస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 57 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చామని, గతంలో ఎప్పుడూ ఊహకు కూడా అందలేదని స్పష్టం చేశారు.

“ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇవాళ జరుగుతున్నది క్లాస్‌ వార్‌ అని గుర్తుపెట్టుకొండి. పేదవాడు ఒకవైపున.. పెత్తందార్లు మరొకవైపున ఉండి యుద్ధం జరుగుతుంది. మీ జగన్‌ ఉంటే పేదవాడు బాగుపడతాడు.  మీ జగన్‌ ఉంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పథకాలు కొనసాగుతాయి. ఇంటికే వాలంటీర్‌ వస్తాడు. చిక్కటి చిరునవ్వులతో అవ్వాతాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్‌ ఉంటేనే బడులు మారుతాయి. పేదవాడు వెళ్లే స్కూళ్లు ఇంగ్లిషు మీడియంలోకి మారుతాయి.  మీ జగన్‌ ఉంటేనే గ్రామాలలో విలేజ్‌ క్లినిక్‌లు పనిచేయడం మొదలుపెడతాయి. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం. విస్తరించిన ఆరోగ్యశ్రీ గొప్పగా పనిచేస్తుంది. ఏ పేదవాడు కూడా ఆరోగ్యం కోసం అప్పులు పాలు కాకుండా.. ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగేలంటే కేవలం జగన్‌ ఉంటేనే జరుగుతుంది” అని వక్కాణించారు.

“45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకొండి. మన పార్టీలో దాదాపు టిక్కెట్లన్నీ కరారు అయ్యాయి. మార్చాల్సినవన్నీ 95 శాతం మార్పు చేశాం. ఏదైనా ఇంకా ఒకటి అరా ఉంటాయి. కచ్చితంగా ఆర్గనైజైషన్‌ మీద ధ్యాస పెట్టండి. ఇందులో మీరు కనుక ఫెయిల్‌ అయితే మిమ్నల్ని ఎవరూ కాపాడలేరు. కారణం ఏమిటంటే.. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంటిలో మంచి జరిగిందని ఏకంగా లెటర్లు రూపంలోఇచ్చి, జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఇచ్చిన పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరు ఆర్గనైజేషన్‌ మీద ధ్యాస పెట్టిండి” అని కార్యకర్తలకు సూచించారు.

గతంలో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు వచ్చాయని, ఈ సారి మాత్రం 175కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలని నేతలు, కార్యకర్తకు తేల్చి చెప్పారు. ఆ దిశగా అంతే నమ్మకంతో అడుగులు వేయాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్