Saturday, July 27, 2024
Homeతెలంగాణమేడిగడ్డ పోయి తుమ్మిడిహట్టి వచ్చేనా..?

మేడిగడ్డ పోయి తుమ్మిడిహట్టి వచ్చేనా..?

తెలంగాణ రాజకీయాలు సామాన్యుడి ఉహకు అందని రీతిలో సాగుతున్నట్టుగా అనిపిస్తోంది. గత ప్రభుత్వ హయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్సు విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందింది.

కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఇప్పటికే దఫా దఫాలుగా మీడియా, ప్రజాప్రతినిధులతో టూర్ నిర్వహించింది. అప్పుడు నల్గొండ బహిరంగ సభ ఉందని వెళ్ళని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చలో కాళేశ్వరం పిలుపు ఇచ్చారు. మార్చి ఒకటో తేదిన  కాళేశ్వరం వెళ్లి ప్రజలకు నిజానిజాలు వివరిస్తామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ మంగళవారం ప్రకటించారు. రెండు మూడు పిల్లర్లు దెబ్బతింటే ప్రాజెక్టు పనికిరాడనే ప్రచారం దుర్మార్గమని విమర్శించారు.

మేడిగడ్డ భవిష్యత్తు ఇంజనీర్ల నివేదికపై ఆధారపడి ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహట్టి దగ్గర కొత్త ఆనకట్ట నిర్మిస్తామని వెల్లడించారు. అదే జరిగితే మరోసారి ప్రజాధనం దుర్వినియోగానికి పావులు కదులుతున్నాయని… తెలంగాణ ప్రయోజనాలకు మేలు చేయదని.. దీని అంతరార్థం ప్రజలు ఆలోచించాలని నీటిపారుదల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కెసిఆర్ హయంలో అక్రమాలు జరిగాయని చెపుతున్న ప్రభుత్వం తుమ్మిడిహట్టి దగ్గర కొత్త నిర్మాణం చేపట్టడంలో అంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాల్సి ఉందని… ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల రూపురేఖలు మారితే జాతి ప్రయోజనాలకే విఘాతమని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరింత కష్టాలలోకి వెళుతుందంటున్నారు.

భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యయం పెరుగుతుందని… ప్రజల జీవన విధానం తిరోగమనం దిశలోకి వెళుతుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న నీటి పారుదల కోసం చెక్ డ్యాంల ద్వారా వాన నీటిని పొదుపుగా వాడుకుంటే ప్రయోజనకరమని హితవు పలుకుతున్నారు.

అధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే అనే వాదనలు ఉన్నాయి. మానవ వనరులు అధికంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు సూచిస్తుండగా… మౌలిక సదుపాయాల కల్పన పేరుతో పాలకులు ప్రాజెక్టులు నిర్మిస్తూ ప్రజాధనం  కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్