మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడంలో ప్రత్యేక కారణాలేవీ లేవని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. మూడు రాజధానులపై గతంలో తమ ప్రభుత్వం విశాలమైన, విస్తృత ప్రయోజనాలకోసం తీసుకున్న ఓ సమున్నత నిర్ణయాన్ని విపక్షాలు చెడుగా చిత్రీకరించాయని, తమ విధానంపై దుష్ప్రచారం చేశారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎన్నో సందేహాలను రేకెత్తించేలా విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పనిచేశాయని పేర్కొన్నారు. వికేంద్రీకరణపై విషప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టి అందరి ఆలోచనలతో సమగ్రంగా మరో బిల్లు తెస్తామని, ఇదే విషయాని సిఎం జగన్ సభకు చెప్పారని నాని వివరించారు.
మెజార్టీ ప్రజల అభిమతానికి అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని కొంత మంది ప్రజల కోసమే పని చేయబోదని అయన స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు కొత్త బిల్లులో చోటిస్తామని, ప్రభుత్వ ఆలోచనను ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణకు ఎలాంటి కాలపరిమితి లేదన్నారు నాని. కోర్టు కేసుల వల్లే మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వాదనని నాని కొట్టి పారేశారు.