కోవిడ్ అదుపులోకి రాగానే 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరీక్షలు నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారని చెప్పారు. రాజమండ్రిలో పర్యటించిన మంత్రి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
ట్రిపుల్ ఐటి, ఎంసెట్ తదితర పరీక్షల్లో పదవ తరగతి మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటానని, అలాంటిది ఈ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులు భవిష్యత్తులో చాలా నష్టపోతారని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో అనవసర రాద్దంతం చేస్తున్నాయని, ప్రజల్లో లేని భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే పరీక్షలు నిర్వహిస్తామని తాము చెప్పడం లేదని, రద్దు డిమాండ్ సరికాదని మాత్రమే అంటున్నామని సురేష్ వివరించారు.
పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు సూచన చేసిందని, కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాత పరీక్షలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ వివరించారు.