Sunday, January 19, 2025
HomeTrending Newsఅమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం: అమిత్ షా

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం: అమిత్ షా

ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి లాంటిదని, అవినీతి కోసమే జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని జాప్యం చేస్తున్నారని… రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఇది మోడీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో గుండాగిరి, ల్యాండ్ మాఫియా, అవినీతిని అంతంచేయడానికి, అమరావతిని మళ్ళీ ఏపీ రాజధాని చేయడానికి, మత మార్పిడులకు వ్యతిరేకంగా… తిరుపతి బాలాజీ పవిత్రతను కాపాడడానికే, తెలుగు భాషను పరిరక్షించడానికే తాము తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకుని కూటమిగా పోటీ చేస్తున్నామని వివరించారు. జగన్ ప్రభుత్వం తెలుగుభాషను అణగదొక్కడానికి కంకణం కట్టుకున్నారని… అందుకే ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టారని… కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు భాషను అంతం కానీయబోమని స్పష్టం చేశారు. 70 ఏళ్ళుగా దేశ ప్రజల కల అయోధ్య రామ మందిరాన్ని మోడీ సాకారం చేశారని, బాల రాముడి విగ్రహ ప్రతిష్టకు రాహుల్ గాంధీ, జగన్ ఇద్దరికీ ఆహ్వానం పంపినా వారు రాలేదని, అలాంటి వారికి ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి చేశారని, ఏపీ విభజన తరువాత కూడా అభివృద్ధికి పునాదులు వేశారని… కానీ సిఎం జగన్ అభివృద్ధిని విస్మరించారని…పెట్టుబడులు ఆగిపోయాయని, అవినీతి, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయాని విమర్శించారు. ఐదేళ్ళలో 13 లక్షల కోట్ల అప్పులు చేశారని, మౌలిక సదుపాయాల కల్పన వదిలేశారని, భూమాఫియా మాత్రం పెరిగిపోయిందన్నారు.

మద్య నిషేధం చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయలేదని, పైగా మద్యం సిండికేట్ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య శ్రీని ఆర్భాటంగా మొదలు పెట్టినా నిధులు విడుదల చేయడంలేదని, ఆస్పత్రుల్లో చికిత్స చేయడంలేదని  అన్నారు.  జగన్ రాయలసీమ ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేశారని…తమ కూటమి అధికారంలోకి రాగానే పోలవరంతో పాటు హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 25 ఎంపి సీట్లు, మూడింట రెండొంతుల అసెంబ్లీ సీట్లు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్