Dj Till Comedy: సిద్ధు జొన్న‌ల‌గడ్డ‌, నేహా శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ‘డిజె టిల్లు’ . విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. ఈనెల 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా విశేషాలను, చిత్రంలో నటించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు నేహా శెట్టి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

“చిన్న‌ప్ప‌టి నుంచే నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలో డ్యాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ‘ముంగారమళై 2’ చిత్రంలో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ‘మెహబూబా’ లో నటించాను. ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు ‘డిజె టిల్లు’ సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”

“సితార ఎంటర్ టైన్మెంట్స్ లాంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే.. ఎలా కాదనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే కారణం కాదు. మంచి స్క్రిప్ట్ ఉంది. సిద్ధూ, విమల్ క్రియేటివ్ గా సినిమాను, ఫన్ గా డిజైన్ చేశారు. మీరు ట్రైలర్ లో డైలాగ్స్ వినే ఉంటారు. ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ‘డిజె టిల్లు ట్రైలర్’ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ.. ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి”.

డిజె టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్టే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. ఎ‌వరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. రాధిక క్యారెక్టర్ ను నేను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ఆ పాత్రలా మారిపోయాను. తప్పును తప్పులా.. ఒప్పును ఒప్పుగా.. చెబుతుంది. నేను రాధిక క్యారెక్టర్ తో చాలా రిలేట్ చేసుకోగలను. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర అది”

“నేను తెలంగాణ యాస విన‌డం కొత్త. ఈ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ యాసలో ఇంకా సినిమాలు రావాలి. చాలా ఫ్రెష్ కామెడీ కథలో ఉంటుంది. హీరోను రాధిక కన్ఫ్యూజ్ చేసినట్లు ట్రైలర్ లో చూపించాం. రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. సిద్ధు టాలెంటెట్ యాక్టర్. అతను యాక్ట్ చేస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయాను. అతను రచయిత, గాయకుడు కూడా. సిద్ధు నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం, బాధపడ్డాం, ఆ ఒత్తిడినంతా డిజె టిల్లు చూస్తే నవ్వుతూ మర్చిపోతారని చెప్పగలను. నేను నటించబోయే కొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఫైన‌లేజ్ కాగానే చెబుతాను” అంటూ విశేషాలు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *