పోలీసులు చింపింది తన బట్టలు కాదని, ప్రజల బట్టలని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.  కాపు రిజర్వేషన్స్ కోసం దీక్ష చేపట్టిన మాజీ మంత్రి సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్యను పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకొని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  చింతమనేని టిడిపి నిర్వహిస్తోన్న బ్లడ్ క్యాంప్ లో శాంపిల్ ఇవ్వడానికి అదే ఆస్పత్రికి వచ్చారు. చేగొండిని పరామర్శించడానికి ఆస్పత్రికి చింతమనేని వచ్చారని భావించిన పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్భంలో చింతమనేని అనుచరులకు- పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పెనుగులాటలో చింతమనేని చొక్కా చిరిగిపోయింది. అదే బట్టలతో ఆయన మంగళగిరి లోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పోలీసు శాఖ ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడానికి, నాయకుల బట్టలు చింపడానికా అంటూ ప్రశ్నించారు. ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటున్న పోలీసులు ఉన్నదని ప్రతిపక్షనేతలపై దురుసుగా ప్రవర్తించడానికి కాదన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తామని, ఆఖరి నిమిషం వరకూ కోట్లాడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని సవాల్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, చేతగానితనాన్ని వేలెత్తి చూపినా సహించలేకపోతున్నారని, అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  టిడిపి నేతలు ఎవరైనా ఎదురు తిరిగితే ఇలాగే ఉంటుందని ఉదాహరణగా చూపేందుకే తనను ఈ విధంగా చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయని, ఈ దాష్టికాలు ఎక్కువ కాలం కొనసాగబోవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీయేనని, తమ విధి నిర్వహణ పక్కన పెట్టి విపక్ష నేతలను వేధిస్తున్న పోలీసు అధికారులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *