Kottu: అయ్యన్న మైకంలో మాట్లాడుతున్నాడు: కొట్టు ఆగ్రహం

దేవాలయ భూములను అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఏపీ డిప్యూటీ సిఎం (దేవదాయ శాఖ)  కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. 4.6 లక్షల ఎకరాల దేవాదాయ భూమి, 1.65కోట్ల గజాల స్థలం ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామని, దీన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీనికి గాను దేవాదాయ చట్టంలో కీలక మార్పులు చేసి ఆర్డినెన్స్ తీసుకు వచ్చామన్నారు. విజయవాడలో దేవాదాయ శాఖపై సమీక్ష అనంతరం మీడియాతో కొట్టు సత్యనారాయణ మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలు 23,600 ఉన్నట్లు గుర్తించామని, వీటిని అర్చకులు, ఆలయ ట్రస్టీలకు అప్పగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ 37 దరఖాస్తులు వచ్చాయని, ట్రస్టీలు, వారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తే అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రముఖ ఆలయాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాలను ఏడాది పొడవునా కొనసాగిస్తామని, హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు.

రిషికొండపై ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే తప్పేమిటని కొట్టు ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు పిచ్చి పిచ్చిగా ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు మైకం తగ్గినట్లు లేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సమస్యే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ కూడా పడిపోయిందని, ఆయన రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్నారని అన్నారు. లోకేష్ ది పాదయాత్ర కాదని, గందరగోళ యాత్ర అని, టిడిపి నాయకులే ఈ యాత్ర చూసి భయపడుతున్నారని కొట్టు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *