చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని, ఆయన పవన్ కళ్యాణ్ ను కూడా వాడుకుని వదిలేస్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఎంతో గొప్పవాడని, అలాంటి వ్యక్తికి బాబు గతంలో ఏ గతి పట్టించారో ఆలోచించాలని, చంద్రబాబుతో కలిస్తే పవన్ కు కూడా అదే గతి పడుతుందని అన్నారు. తాను పవన్ ను వ్యక్తిగతంగా కలిసి కొన్ని అంశాలు చెప్పాలని అనుకున్నానని, కానీ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అన్నారు. గుడివాడలో కొడాలి మీడియా తో మాట్లాడారు.
లింగమనేని, నాదెండ్ల మనోహర్ లాంటి వారు చంద్రబాబు శ్రేయోభిలాషులని, బాబే సిఎంగా ఉండాలని ఎప్పుడూ ఆలోచించే వారని… అలాంటి వారిని వెంట పెట్టుకొని తమపై దాడి చేస్తామంటే తప్పకుండా పవన్ ను అడ్డుకుంటామని నాని స్పష్టం చేశారు. బాబుకు మద్దతుగా నిలబడే ఎవరినైనా రాజకీయంగా బట్టలూడదీస్తామని హెచ్చరించారు.
కొత్త రాజకీయాలు తీసుకొస్తానంటూ పవన్ చెబుతున్నారని, దానిపై తమకెలాంటి అభ్యంతరం లేదని, కానీ దొంగలను, 420 గాళ్ళను పక్కన పెట్టుకోవడం మానుకోవాలని, ఒక వేళ అలా వారిని వెంట పెట్టుకొని తమపై దాడి చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇద్దరూ కలిసి వస్తానంటే బాబును ఎలా చూస్తామో పవన్ ను కూడా అలాగే చూస్తామన్నారు. కానీ వారితో కలిసి, వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ను, స్క్రిప్ట్ ను అమలు చేస్తామంటే అందరినీ ఒక కూటమిగానే చూస్తామని వివరించారు.