Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపునర్ ప్రతినిధి

పునర్ ప్రతినిధి

Back Fire: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ అన్న మాటను కింది కోర్టులు దోషంగా పరిగణించాయి. వెంటనే పార్లమెంటు కార్యాలయం ఆయన లోక్ సభ   సభ్యత్వాన్ని రద్దు చేసి…మాజీని చేసి…ఢిల్లీలో అధికారిక బంగ్లాను కూడా ఆగమేఘాల మీద ఖాళీ చేయించారు. గుజరాత్ హై కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించడంతో రాహుల్ కు ఉన్న చివరి అవకాశంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కింది కోర్టుల తీర్పును కొట్టేసి…రాహుల్ కు ఊరటనిచ్చింది. దాంతో వెంటనే పార్లమెంటు కార్యాలయానికి  కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది. రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. రాహుల్ పార్లమెంటుకు తిరిగి వెళ్లారు.

ఈ కథ సుఖాంతం అయితే అయి ఉండవచ్చుగాక. శుభం కార్డు పడడానికి ముందు జరిగిన వరుస పరిణామాలన్నీ ఒక్కో ప్రహసనంలా ఉన్నాయి.

1 . నిందాపూర్వక వ్యాఖ్యలకు చట్ట సభల సభ్యులను దోషులుగా తేల్చిన సందర్భాల్లో...శిక్షగా వారి సభ్యత్వాలను వెను వెంటనే రద్దు చేసిన ఈ ప్రజాస్వామ్య పరమ ప్రమాణ దేవాలయాదేశమే ఒక కొలమానమయితే…ఈ దేశంలో నిందాపూర్వక వ్యాఖ్యలు చేయని ప్రతినిధులు ఎంతమంది ఉంటారు? చేసినా కోర్టుల దాకా వెళ్లని సందర్భాలు ఎన్ని ఉంటాయి? ఈ తీర్పు వెలుగులో ఇప్పటికే సభ్యత్వం రద్దు కావాల్సిన సభ్యులు వందల్లో ఉండి ఉంటారా? వేలల్లో ఉండి ఉంటారా?

2 . కింది కోర్టు తీర్పు తరువాత హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు ఉన్న హక్కులను, అవకాశాలను ఒక పార్లమెంటు సభ్యుడికే వీలు కల్పించకపోతే ఇక ప్రజాస్వామ్య పరిణితి, పరిపక్వత, సంయమనం, ప్రజాస్వామ్య స్ఫూర్తి లాంటి ఆదర్శాలకు అర్థమేముంది?

3 . వెంటనే ఢిల్లీలో రాహుల్ బంగ్లాను ఖాళీ చేయించడానికి నోటీసులు ఇవ్వాలా? లేకపోతే ఆ వీధిలోకి కూడా బుల్డోజర్లు వచ్చి ఉండేవా? రాహుల్ తనే నిర్ణయం తీసుకున్నారో? లేక ఎవరయినా సలహా ఇస్తే…విని…ఖాళీ చేశారో కానీ…హుందాగా వెంటనే ఖాళీ చేసి మౌనంగా వెళ్లిపోయారు. పప్పు పప్పు అని రాహుల్ ను విమర్శిస్తే…రాహుల్ ఒప్పు ఒప్పు అని కర్ణాటక ప్రజలు అనుకోవడంలో ఇలాంటివేవో ఉపయోగపడి ఉంటాయి.

4 . ఉన్నత స్థానంలో ఉన్నంత మాత్రాన ఉన్నతులు కాలేరు. ఉన్నతమయిన ప్రవర్తన, స్వభావాలతోనే ఉన్నతులు కాగలుగుతారు.

5 . ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య దేవాలయంలో…అయితే మళ్లీ నేనిప్పుడు సభ్యుడినేనా? అయితే మళ్లీ సభకు రావచ్చా? అన్నట్లు ఒక సభ్యుడి ముందు టు బి…ఆర్ నాట్ టు బి…రద్దు- పునరుద్ధరణలు మెదిలితే…దాన్ని ప్రజాస్వామ్యమంటామా?ప్రహసనమంటామా?

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్