వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి మూడింట రెండొంతులు తగ్గించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) శాస్త్రవేత్తల బృందం తెలిపింది. శిలాజ ఇంధనాల అన్వేషణకు ఇక ముగింపు పలకాలని, ధనిక దేశాలు 2040నాటికి బొగ్గు, ఆయిల్, గ్యాస్ వాడకానికి స్వస్తి పలకాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ సూచించారు. మానవాళి ప్రస్తుతం అతి పల్చటి మంచుపై ఉన్నదని, అది వేగంగా కరిగిపోతున్నదని వ్యాఖ్యానించారు. పర్యావరణ మార్పులపై అన్ని వైపుల నుంచి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.