పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటిసారిగా వచ్చిన దీది హస్తినలో ప్రతిపక్షాల్ని ఏకం చేసే పనిలో ఉన్నారు. బిజెపితో ప్రత్యక్ష పోరుకు సిద్దమైన మమత బెనర్జీ పెగాసేస్ వ్యవహారంపై ఇప్పటికే విచారణకు ఆదేశించి కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టారు. మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన మమత బెనర్జీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి రాష్ట్రంలోని వివిధ అంశాల్ని ప్రస్తావించే పనిలో ఉన్నారు. ఈ లోగా విపక్షనేతలతో సమకాలిన, భవిష్యత్ రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు.
ఈ రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మలు మమత బెనర్జీని కలిశారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు సమాచారం. కేంద్రాన్ని నిలదీసే విషయంలో అన్ని పార్టీలు ఏకం కావాలని, ఇందుకు కలిసివచ్చె పార్టీలతో సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని నేతలు సమాలోచనలు చేశారని వినికిడి. మమత బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచాక మొదటిసారిగా ఢిల్లీ వచ్చారని ఆమెకు అభినందనలు తెలిపేందుకే కలిశామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.
కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన మమత బెనర్జీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్ని ఏకరువు పెట్టారు. బెంగాల్ కు వ్యాక్సిన్ సరఫరా తక్కువగా ఉందని, వెంటనే వ్యాక్సిన్ సప్లయ్ పెంచాలని కోరారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న బెంగాల్ పేరు మార్పును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ పేరును బెంగాల్ గా మార్చాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. పెగాసేస్ వ్యవహారంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని మమత బెనర్జీ కోరారు.
నందిగ్రామ్ లో ఓడిపోయినా మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే త్వరలోనే ఉపెన్నికల్లో గెలవాల్సి ఉంది. భవానీపూర్ శాసనసభ స్థానం ఇప్పటికే ఖాళీగా ఉంది. భవానీపూర్ కు సకాలంలో ఉపఎన్నిక నిర్వహించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడిని కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మమత బెనర్జీ కలుసుకోనున్నారు. ఎల్లుండి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో సమావేశం అవుతారు.