West Indies Beat Bangladesh By 3 Runs :
వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన వెస్టిండీస్ ఎట్టకేలకు ఓ విజయం దక్కించుకుంది. నేడు బంగ్లాదేశ్ తో ఆఖరి బంతి వరకూ ఉత్కంతభరితంగా సాగిన పోరులో పైచేయి సాధించింది. బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో వెస్టిండీస్ మూడు పరుగులతో విజయం సాధించింది.
షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ లూయీస్ ఆరు పరుగులే చేసి మూడో ఓవర్లో ఔటయ్యాడు. కొంత కాలంగా విఫలమవుతున్న క్రిస్ గేల్ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగినా రాణించలేకపోయాడు. పది బంతులు ఆడి కేవలం ఐదు పరుగులే చేసిన ఐదో ఓవర్లో ఔటయ్యాడు. రోస్టన్ ఛేస్-39; నికోలస్ పూరన్-40; చివర్లో హోల్డర్ ఐదు బంతుల్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు చేయడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మహేది హాసన్, ముస్తాఫిజూర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు.
బంగ్లాదేశ్ కూడా ప్రయోగం చేసి, షకీబ్ అల్ హసన్ ను ఓపెనర్ గా దింపింది. అయితే 9 పరుగులే చేసి షకీబ్ మొదటి వికెట్ గా ఔటయ్యాడు. మరో ఓపెనర్ మహమ్మద్ నయీం 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లిటన్ దాస్-44; కెప్టెన్ మహ్మడుల్లా-31(నాటౌట్) రాణించారు. చివరి ఓవర్లలో రన్ రేట్ పెరగడంతో లక్ష్య సాధనలో బంగా విఫలమైంది.
విండీస్ జట్టులో 40 పరుగులు చేసిన నికోలస్ పూరన్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు.
Must Read :విండీస్ పై సౌతాఫ్రికా విజయం