కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోన్న వెస్టిండీస్ నేడు ఓ అద్భుత విజయంతో సత్తా చాటింది. గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను 8 పరుగుల తేడాతో ఓడించి 27 ఏళ్ళ తరువాత కంగారూలను వారి సొంత గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది.
రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు విండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. గత వారం ముగిసిన మొదటి టెస్టులో కంగారూలు 10 వికెట్లతో విండీస్ ను ఓడించారు. ఈ నెల 25 న మొదలైన రెండో టెస్ట్ లో విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 289 రన్స్ మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో కరేబియన్లు 193 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
మొత్తంగా 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిన్న మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. షమర్ జోసెఫ్ అద్భుతంగా రాణించడంతో ఆసీస్ 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో విండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయం అందుకుంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ డ్రా గా ముగిసింది. ఆసీస్ జట్టులో స్టీవెన్ స్మిత్ 91 (నాటౌట్); కామెరూన్ గ్రీన్-41 మాత్రమే రాణించారు.
తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్న షమర్ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. తొలి టెస్టులోనూ ఐదు వికెట్లతో రాణించాడు.
2003లో స్వదేశంలో ఆసీస్ తో జరిగిన సిరీస్ లో రెండో టెస్ట్ మ్యాచ్ ను గెల్చుకొని ఆ సిరీస్ ను కూడా డ్రా చేసుకుంది. మళ్ళీ 21 ఏళ్ళ తరువాత ఆసీస్ పై విజయం అందుకుంది.
షమర్ జోసెఫ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ అఫ్ ద సిరీస్ కూడా దక్కింది.