ఇండియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను వెస్టిండీస్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన ఐదవ మ్యాచ్ లో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ రాణించి 55 బంతుల్లో5 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆజేయంగా 85 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
లాడెర్ హిల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా ఈ లక్ష్యాన్ని విండీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే సాధించింది. నికోలస్ పూరన్ 35 బంతుల్లో ఒక ఫోర్ నాలుగు సిక్సర్లతో 45 పరుగులు చేయగా, షాయ్ హోప్ 13 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 22 పరుగులు చేసి నాటౌట్ గానిలిచాడు.
ఇండియా బౌలర్లలో ఆర్ష్ దీప్ సింగ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు ఇండియా తొలి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ వికెట్ కోల్పోయింది. మూడవ ఓవర్లో మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ కూడా వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్ 45 వంతుల్లో 4 ఫోర్లు , 3 సిక్సర్లతో 61; తిలక్ వర్మ 27 పరుగులు చేశారు. మిగిలినవారు పెద్దగా రాణించక పోవడంతో ఇండియా 165 పరుగులు చేయగలిగింది.
విండీస్ బౌలర్లలో రోమానియా షెఫర్డ్ 4; అకిల్ హుస్సేన్, హోల్డర్ చెరో 2; రోస్టన్ చేస్ ఒక వికెట్ పడగొట్టారు.
రోమానియా షెఫర్డ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్; నికోలస్ పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ లభించాయి.