ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బిజెపి, సమాజ్ వాది పార్టీలు ఎన్నికల క్షేత్రంలో ప్రధానంగా తలపడుతుండగా చిన్న పార్టీలు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. బిహార్ కు చెందిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) యూపీలో తన సత్తా చాటుకోవాలని ఉవ్విలూరుతోంది. బిహార్ లో నాలుగు ఎమ్మెల్యే సీట్లతో వికాస్ శీల్ పార్టీ మంత్రివర్గంలో స్థానం సంపాదించింది.
వికాస్ శీల్ పార్టీ ఎన్.డిఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే నితీష్ ప్రభుత్వంలో ఆ పార్టీ అధ్యక్షుడు ముకేష్ సాహ్ని మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మత్స్యకార వర్గంలో పట్టు ఉన్న పార్టీగా యుపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని శాసనసభ స్థానాలు తమకు ఇవ్వాలని బిజెపిని కోరుతోంది. ఉత్తరప్రదేశ్ లో మత్స్యకారులు 14 శాతం ఓటర్లుగా ఉన్నప్పటికీ అసెంబ్లీ లో తగిన ప్రాతినిధ్యం లేదని వికాస్ శీల్ పార్టీ వాదిస్తోంది.
అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఈ వర్గాన్ని పట్టించుకోలేదని యోగి ఆదిత్యనాథ్ కూడా మత్స్యకారుల సమస్యలు తీర్చ లేదని విఐపి యుపి శాఖ అధ్యక్షుడు చౌదరి లవతాన్ రామ్ నిషాద్ ఆరోపించారు. 157 శాసనసభ సీట్లలో గెలుపు ఓటములు తారుమారు చేయగల సత్తా మత్స్యకారులకు ఉందని నిషాద్ వెల్లడించారు.
బిహార్ సరిహద్దుల్లోని తూర్పు యుపి జిల్లాలు బలియా, దేవరియా, మహారాజ్ గంజ్, కుశినగర్, సంత్ కబీర్ నగర్ తదితర జిల్లాల్లో వికాస్ శీల్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది.