చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించింది. వైరస్ బారినపడి దవాఖానల్లో చేరిన వారి సంఖ్య, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనా మరణాలు, టీకాలపై డాటాను పంచుకోవాలని చైనా ఆరోగ్య అధికారులకు సూచించింది. జీరో-కోవిడ్ పాలసీని ఎత్తివేసిన తర్వాత డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో జనాలు వైరస్ బారిన పడుతున్నారు.
దీంతో గత కొన్నిరోజులుగా చైనాలో రోజువారిగా నమోదవుతున్న కరోనా కేసులను వివరాలను వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌ఓ రియల్ టైమ్ డాటాను పంచుకోవాలని ఆదేశించింది. కాగా, మహమ్మారి జూలు విదిల్చినప్పటికీ తక్కువ పరీక్షలు చేస్తుండటంతో అధికారిక కేసుల గణాంకాలు నమ్మదగినవి కావని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నది. జనవరి 3న జరగనున్న డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమావేశంలో వైరల్ సీక్వెన్సింగ్ పై డేటాను సమర్పించాలని చైనా శాస్త్రవేత్తలను కోరింది. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్‌పై చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సూచించిన విషయం తెలిసిందే.