10.1 C
New York
Friday, December 1, 2023

Buy now

HomeTrending Newssettlers: సీమాంధ్రుల ఓట్ల కోసం పార్టీల పాట్లు

settlers: సీమాంధ్రుల ఓట్ల కోసం పార్టీల పాట్లు

తెలంగాణ ఎన్నికలలో ఆంద్ర ప్రజల ఓట్లు ఎవరికి దక్కుతాయి అనే అంశం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఈ దఫా కొంత భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు..రాజమండ్రి జైలుకు తరలించటం…బెయిల్ కోసం ఏసిబి కోర్టు దగ్గరి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం…ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. బాబు విడుదల కోసం సాఫ్ట్ వేర్ నిపుణులు, ఇతర అభిమానులు హైదరాబాద్లో నిరసనలు చేపట్టారు. దీనిపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో ఆంద్ర రాజకీయాలతో అలజడి చేయద్దన్నారు.

మంత్రి కేటిఆర్ కు టిడిపి అభిమానులు, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వటంతో విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో ఒక్కసారిగా సెటిలర్ల ఓట్ల మీద చర్చ మొదలైంది. సీమాంధ్ర వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు నానా పాట్లు పడుతున్నాయి.

హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరువు, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, మేడ్చల్, మల్కజగిరి, ఉప్పల్, ఎల్.బి నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో సీమాంధ్ర ప్రజలు పెద్ద సంఖ్యలో స్టిరపడ్డారు. ఉమ్మడి ఖమ్మం,నల్గొండ జిల్లాల్లో వీరి ప్రభావం ఉంటుంది.

ఓటుకు నోటు కేసు దగ్గరి నుంచి కెసిఆర్-చంద్రబాబు మధ్య చెడింది. అక్కడి నుంచి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. 2018 ఎన్నికల నాటి నుంచి టిడిపికి తెలంగాణ రాజకీయాల్లో స్థానం లేకపోవటంతో సెటిలర్లు క్రమంగా టిడిపి నుంచి బీఆర్ఎస్ వైపు మళ్ళారు. రెండుసార్లు GHMC ఎన్నికల్లో కారు గుర్తుకే పట్టం కట్టారు.

తెలంగాణ ప్రజలకు వర్తించే అన్ని పథకాలు సీమాంధ్ర ప్రజలకు వర్తిస్తాయని వివిధ సందర్భాల్లో సిఎం కెసిఆర్ స్పష్టత ఇచ్చారు. అయితే గులాబి పార్టీలో సీమాంధ్రకు చెందిన కొన్ని కులాలకే ప్రాధాన్యం దక్కుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రాజులు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, కాపు వర్గాలు మినహా ఇతర సామాజిక వర్గాలను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శ ఉంది. ఏపి ప్రస్తావన వస్తే ఈ వర్గాల ప్రయోజనాలే సీమంధ్ర ప్రయోజనాలు అనే కోణంలో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుతో సీమాంధ్ర వోటర్లు కారు,పువ్వు గుర్తులకు బుద్ది చెపుతారని టిడిపి అనుకూల వర్గాలు ఊదరకొడుతున్నాయి. వీరి ప్రచారం చూస్తుంటే తెలంగాణ ఎన్నికల్లో బాబు అరెస్టు అంశమే అజెండాగా సాగాలనే ధోరణి కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రజల పేరు చెప్పి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు కొందరు నేతలు యత్నిస్తున్నారు.

చంద్రబాబుతోనే హైదరాబాద్ బాగు పడ్డట్టు మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం పోగొట్టేందుకే సిఎం కెసిఆర్ సచివాలయం దగ్గర నుంచి హైటెక్ సిటీ వరకు రూపు రేఖలు మార్చేశారని విశ్లేషకులు అంటారు. టిడిపి అనుకూల వర్గాలు కెసిఆర్ టార్గెట్ గా విమర్శలు చేయటం అధికమైతే…కారు స్పీడును ఎవరు ఆపలేరు. సిఎం కెసిఆర్ వైఖరి చూస్తుంటే ఎన్నికలు ముగియగానే ఈ అంశం ఎత్తుకునే సూచనలు ఉన్నాయి.

సీమాంధ్రుల మద్దతు లేకపోతే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయటమే కష్టం అన్నట్టుగా కొన్ని పార్టీల నేతల వ్యవహార శైలి ఉంది. ఈ విధంగా మాట్లాడే నేతలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. టిడిపి ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. టిడిపి అభిమానులు ఎవరు వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

సీమాంధ్ర ప్రజలు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… కెసిఆర్ కుటుంబం, మంత్రులపై రాజీలేని విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. చంద్రబాబు వ్యవహారంలో దాపరికం లేకుండా మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ లో కొందరు తప్పుపట్టినా పట్టించుకోలేదు. సీమాంధ్ర రెడ్డి సామాజిక వర్గం కూడా కొంత రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తారని అంటున్నారు.

టిడిపి అభిమానుల వోట్ల కోసమా అన్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…లోకేష్ తో సమావేశం కావటం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ఏపి,తెలంగాణ అధ్యక్షులు పురుంధేశ్వరి, కిషన్ రెడ్డి పాల్గొనటం ఇందుకు బలం చేకూర్చింది. తాజాగా జనసేనతో పొత్తు కమలం పార్టీకి కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఇదంతా ఒక వైపు… ఏపి సిఎం జగన్ ను అభిమానించే వారు, ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందుతున్న సీమాంధ్ర వోటర్లు ఎవరి వైపు ఉంటారు. లబ్ది పొందుతున్న వారిలో అధిక శాతం దిగువ మధ్యతరగతి వారే ఉన్నారు. తెలంగాణలో స్థిరపడ్డ వారిలో ఈ వర్గం వారే అధికంగా ఉన్నారు.

చంద్రబాబు అరెస్టు ఎంతగా ప్రభావం చూపుతుందో…ఏపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రభావితం చేస్తాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల్లో యువత అధికంగా ఉన్నారు. ఈ విధంగా సీమంధ్ర ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే అంశాలలో అనేక వైరుధ్యాలు ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్