Tuesday, March 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఐ ఐ టి విద్యార్థి ఆత్మహత్య

ఐ ఐ టి విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరుపొందిన ఫిన్లాండ్ లో తొమ్మిదేళ్ల వయసుదాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన అన్ని మౌలికమయిన విషయాలను చెబుతారట. వినడానికే మనకు చాలా విచిత్రంగా ఉంది కదా? స్వేచ్ఛగా, హాయిగా, ఇష్టంగా పిల్లలు ఎలా చదువుతారో ఫిన్లాండ్ ఎప్పుడో పసిగట్టింది. విద్యాబోధనలో ప్రయోగాలు చేసింది. పిల్లలకు బరువు తగ్గించింది. పిల్లల ఊహా శక్తికి రెక్కలు తొడిగింది. అద్భుతాలు సాధించింది. మిగతా ప్రపంచం అందుకోలేనంత ఎత్తుకు చేరింది.

ఇదంతా ఉపోద్ఘాతం. ఇంత ఉపోద్ఘాతానికి కారణం- హైదరాబాద్ ఐ ఐ టీ పి జి విద్యార్థి ఆత్మహత్య. ఆ విద్యార్థికి జీవితంలో జీవం లేదట. భవిష్యత్తు చీకటిగా కనిపించిందట. పరిశోధన థీసిస్ ఒత్తిడి ఉందట. ఉద్యోగం రాదేమో అన్న ఆందోళన ఉందట.

ఎన్నెన్ని కష్టాలను ఎంత అవలీలగా భరించావు నాన్నా? నేను ఒక్క సమస్యకే తనువు చాలిస్తున్నాను…అని తండ్రిని ఉద్దేశిస్తూ ఆ విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ లోనే సమాధానం ఉంది. చంపుడు పందెం చదువుల్లో పడ్డవారికి బతుకు బరిలో గిరి గీచి నిలబడే ధైర్యం ఉండడం లేదు.

ఒత్తిడిని తట్టుకోలేక ధూమపానం, మద్యపానం అలవాటు చేసుకున్నాను. అవి మరింతగా కుంగదీశాయి…అని నిజాయితీగా తప్పు ఒప్పుకున్నాడు. కానీ…తప్పు తెలిసినా…దిద్దుకోలేకపోయాడు. శాశ్వతంగా వెళ్లిపోయాడు.

“జీవం లేని జీవితం జీవించలేను” అంటూ…హాస్టల్ గదిలో మంచానికి ఉరేసుకుని తనువు చాలించాడు. కరోనా దెబ్బకు ఆన్ లైన్ క్లాసుల ఒత్తిడి కూడా ఒక కారణంగా కనిపిస్తోది.

బాగా మార్కులు రానివారు రాలేదని, వచ్చినవారు జీవంలేని మార్కులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటుంటే చివరికి మిగిలేదెవరు? వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన ఎన్ని కొంగొత్త విషయాలకు దిక్కేది? మొక్కేది? వారు బతికి ఉండి మిసమిసలాడుతూ…తుళ్లుతూ…గడపాల్సిన ఘడియలు దిగులుపడుతున్నాయి. వారు పోయి ఎన్ని జీవితాలు జీవం లేనివైపోతున్నాయి?

ప్రాపంచిక విషయాలను పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఫిన్లాండ్ ఎందుకు పెట్టిందో మనకెందుకు?
ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి ఫిన్లాండ్ ఎందుకంత ప్రాధాన్యమిస్తోందో మనకెందుకు?
బతుకులో ఎదురయ్యే ప్రతి సందర్భానికి ఒక విశాల తాత్విక భూమిక ఉందని…బతుకు ఒక నిత్య వసంతంగా ప్రవహించే వర్ణ శోభిత పూల రుతువు అని అడుగడుగునా తెలియజెప్పే ఫిన్లాండ్ పాఠం మనకెందుకు?
జీవితమంటే బతుకు పాదులో ఆశల నీరు పోసి…ప్రతి క్షణాన్ని ఆనందమయంగా జీవించడమనే ఫిన్లాండ్ పాఠశాల విద్య మనకెందుకు?

బెల్ మోగుతోంది…
కర్ర పట్టుకుని కాలేజీ పిలుస్తోంది.
పదండి..పోదాం…
చదువుల చీకటి గదుల్లోకి.

పదండి…పోదాం…
ర్యాంకుల అంకెలు రంకెలేసే గొడ్ల చావిట్లోకి.

పదండి…పోదాం…
అర్థం కాని శ్మశానాల చదువుల నిఘంటువుల్లోకి.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

నారాయణ చైతన్యం

Also Read :

భాషకు లోకం దాసోహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్