హైదరాబాద్ లో నిర్వహించిన వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్-2024 విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 3 నుండి 5 వరకు మూడు రోజులపాటు జరిగిన ఈ సమ్మిట్ లో దేశం నలుమూలల నుండి వికీమీడియా ప్రాజెక్ట్‌ల సాంకేతిక నిపుణులు, డెవలపర్‌లు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండిక్ మీడియా వికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) హైదరాబాద్ నిర్వహించిన ఈ సమ్మిట్‌లో తొలిరోజు IIIT హైదరాబాద్ క్యాంపస్‌లో హ్యాకథాన్ నిర్వహించారు. గచ్చిబౌలిలోని హోటల్ హయత్ లో సమ్మిట్ జరిగింది. వివిధ సంస్థలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరై ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, వికీమీడియా ప్రాజెక్ట్‌లలో తాజా పరిణామాలు, సరికొత్త ఆవిష్కరణలపై చర్చించారు.
‘అందరికీ వికీ టెక్: ఎంపవరింగ్ వాయిస్, ఎక్స్‌పాండింగ్ హారిజాన్స్’ అంశంపై జరిగిన చర్చా వేదికలో… తక్కువ మంది మాట్లాడే భాషలను సైతం వికీపీడియా, వికీమీడియాల్లో ఎలా చేర్చాలి, వాటిని ఎలా మెరుగుపరచాలనే అంశంపై దృష్టి సారించారు. వివిధ కళాశాలల నుండి పాల్గొన్న డెవలపర్‌లు, పరిశోధకులు, వికీక్లబ్ విద్యార్థులను ఒకచోట చేర్చి, విభిన్న వికీమీడియా యూజర్స్ గ్రూప్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూలంకషంగా చర్చించారు.
భారతదేశంలోని వివిధ భాషలకు సంబంధించి మరింత మెరుగైన సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేయడానికి వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2024 ఎంతగానో దోహదం చేస్తుందని IIT హైదరాబాద్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ… ఈ సమ్మిట్ నిర్వహణలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ రాధికా మామిడి అభిప్రాయపడ్డారు.
AI ప్రభావంపై మొదటి రోజు విస్తారమైన ప్యానెల్ చర్చ జరిగింది. AI4Bharat, BITS పిలానీ, CIS, IIIT హైదరాబాద్ మరియు మైక్రోసాఫ్ట్ నుంచి నిపుణులు పాల్గొని విలువైన సలహాలు అందించారు. కేరళలో ఇటీవలి సంక్షోభ సమయంలో వివిధ ప్రాంతాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడిందో వివరించారు. వికీమీడియా కమ్యూనిటీలు మరియు వర్క్‌షాప్‌లు ఉపయోగించే సాంకేతికతలో లింగబేధాన్ని పరిష్కరించే అంశంపై 2వ రోజు సమిట్ దృష్టి సారించింది. దీనికోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని తీర్మానించింది.
హ్యాకథాన్ షోకేస్‌తో ఈ సమ్మిట్ ముగిసింది. ఔత్సాహికులు సాంకేతిక పరిజ్ఞానంలో రూపొందించిన వినూత్న పరిష్కారాలను, ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరికరాలు, వాటి నవీకరణలపై ప్రదర్శనలు ఇచ్చి…. విలువైన సూచనలు అందించారు, ఆ తర్వాత వికీమీడియా భవిష్యత్తు, భారతీయ భాషలలో ఓపెన్ సోర్స్ టెక్నాలజీపై చర్చ జరిగింది.
ఈ సమ్మిట్ కు సంబంధించి మరింత సమాచారం కోసం https://wts2024.indicwiki.org/; https://commons.wikimedia.org/wiki/Category:Wikimedia_Technology_Summit_2024 లను సంప్రదించవచ్చు.