మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడుగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్, ఆయన ప్యానల్ సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది అభ్యర్థులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ఎఫ్.ఎన్.సి.సిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో రౌడీయిజం చేశారని.. నరేష్ ప్రవర్తన సరిలేదని.. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడి పై చేయి చేసుకున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు
మా ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండో రోజు ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని.. క్రాస్ ఓటింగ్ జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్స్ లో అన్యాయం జరిగిందని ప్రకాష్ రాజ్ అన్నారు. మోహన్ బాబు ఎన్నికల ప్రక్రియలోనే కూర్చున్నారని.. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారని తెలిపారు. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనల పై తన ప్యానెల్ సభ్యులతో చర్చించామని.. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన సభ్యులు అన్నారని.. అందుకే మా సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియచేశారు.
తన రాజీనామా గురించి మాట్లాడుతూ.. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. మంచు విష్ణు స్వీకరించనని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటాను కానీ ఒక కండిషన్. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగువాడు కాని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే విధంగా నియమ నిబంధనలు మారుస్తామన్నారు. అలా మారిస్తే.. ఓటు వేయడానికో గెలిపించడానికో నాకు ఇష్టం లేదు. కనుక రాజీనామా చేస్తాను. నిబంధనలు మార్చకుండా.. మా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయచ్చు అంటే నేను మా సభ్యుడుగా కంటిన్యూ అవుతాను ప్రకాష్ రాజ్ అన్నారు.