Saturday, November 23, 2024
HomeTrending Newsఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన చలి...15 రోజుల్లో 157 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన చలి…15 రోజుల్లో 157 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో చలిగాలులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. చలితో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. 15 రోజుల వ్యవధిలో దాదాపు 157 మంది మృత్యువాత పడ్డారంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే చావులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడి మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో మైనస్‌ 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తాలిబాన్‌ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చే దిశలో లేకపోవడంతో ప్రజలు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. జనాభాలో మూడింట రెండు వంతుల ప్రజలు బతికి ఉండాలంటే తక్షణ చర్యలు అవసరమని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. చలిగాలులు విపరీతంగా ఉండటంతో ఈ నెల 10 నుంచి 19 వ తేదీ వరకు 78 మంది మరణించారు. గత వారం ఈ సంఖ్య రెట్టింపయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా ఉన్న కారణంగా చలి నుంచి కాపాడుకునేందుకు, ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కేందుకు వారు సతమతమవుతున్నారు.

గత 15 ఏండ్లలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంత తీవ్రమైన చలి లేదని రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొన్నది. మంచు తుపాను కారణంగా పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దేశంలోని 34 ప్రావిన్సుల్లో 8 ప్రావిన్సుల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. చలితో మరణించిన వారి సంఖ్య 8 ప్రావిన్సుల్లోనే అత్యధికంగా ఉన్నది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక, మానవ హక్కుల సంక్షోభం పెరిగిపోయింది. ఇటీవల ఎన్జీవోల్లో మహిళలు పనిచేయకుండా నిషేధం విధించారు. దీంతో వాతావరణ బీభత్సంతో సతమతమవుతున్న ప్రజలకు రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడుతున్నది. ఎన్జీవోల్లో మహిళలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కావాల్సిన సాయం అందడం లేదని పలు నివేదికలు చెప్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్