ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అద్భుత విజయం నమోదు చేసింది. సీజన్ మొదట్లో తడబడ్డ ఈ జట్టు ఆ తర్వాత తేరుకొని మంచి ఆటతీరు ప్రదర్శిస్తోంది.
సొంత గడ్డ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇచ్చిన 182 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. ఢిల్లీ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 45బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ అఫ్ దమ్యాచ్ అందుకున్నాడు. మరో ఓపెనర్, కెప్టెన్ డేవిడ్ వార్నర్-22; మిచెల్ మార్ష్ – 26 పరుగులు చేయగా, రీలీ రోస్సో-35; అక్షర్ పటేల్-8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బెంగుళూరు బౌలర్లలో హాజెల్ వుడ్, కర్ణ శర్మ, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.
అంతకు ముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగుళూరు తొలి వికెట్ కు 82 పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లెసిస్ -45 పరుగులు చేసి ఔట్ కాగా, ఆ తర్వాతి బంతికే మాక్స్ వెల్ డకౌట్ గా వెనుదిరిగాడు, కోహ్లీ 55పరుగులు చేసి జట్టు స్కోరు 137 వద్ద ఔట్ కాగా, దినేష్ కార్తీక్ (11) మరోసారి విఫలమయ్యాడు. లామ్రోర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54; అనూజ్ రావత్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకి 181 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 2; ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.