ఏ ఉద్యమమైనా కానీ, మహిళల సహాయం లేకుండా విజయం సాధించేదా? స్వాతంత్ర్య సమరం నుంచి నిర్భయ చట్టం వరకు మహిళల భాగస్వామ్యం కాదనలేనిది. మహిళలు మాత్రమే పోరాడి సాధించుకున్న ప్రత్యేక విజయం మహిళా దినోత్సవం. ఎందరో మహిళల కృషి ఫలితమిది. అయితే కాలక్రమేణా ఇది ఒకరోజు ఉత్సవంగా మాత్రమే మిగిలింది. ఆ స్ఫూర్తి మరింత ప్రగతికి మార్గం కావడం లేదు. ఎక్కడన్నా మహిళా దినోత్సవం రోజు సంబంధిత ఫోటో ప్రదర్శన, ఉద్యమకారిణులను స్మరించడం చూశారా? ఎంతసేపూ ఆటలు,పాటలకే పరిమితం అవుతోంది. ఆ అవకాశం కూడా లేని మహిళలూ ఎందరో. ఒక సందర్భాన్ని గుర్తుచేసే ప్రదేశం లేదా స్మారకం ఎప్పుడూ ప్రత్యేకమే. అరుదైన ఈ ఘనతకు వేదికైంది రాజమండ్రి. ఆ వార్తకు వేదికైంది ఈనాడు వసుంధర. వార్త చిన్నదే అయినా కలిగించే స్ఫూర్తి, దీప్తి ప్రత్యేకం. అక్కడి కోటిపల్లి బస్టాండ్ సమీపంలో పాల్ చౌక్ అనే పార్క్ ఉంది. ఇక్కడ దేశంకోసం కష్టపడిన పన్నెండుమంది మహిళా దేశభక్తుల విగ్రహాలు ఉన్నాయి. వారి వివరాలు కూడా ఇచ్చారు.జవహర్ లాల్ నెహ్రూనే ఆహ్వానపత్రం లేదని అడ్డగించిన దుర్గాబాయ్ దేశముఖ్ మొదలుకొని మరో పదకొండుమంది తెలుగు మహిళల వివరాలున్నాయి. అనేక కట్టుబాట్లను ఛేదించి వీరు పోరాడిన తీరు అద్వితీయం. ఇటువంటి పార్కులు మరింతగా వస్తే ముందుతరాలవారికి చరిత్ర తెలుస్తుంది. ఈ పార్కు రూపకర్తలకు, వార్త ప్రచురించిన ఈనాడుకు, రిపోర్టర్ కు అభినందనలు