unfreeze assets: కాబూల్ లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని, తమ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులు, నిధులను విడుదల చేయాలని కోరుతూ పెద్ద సంఖ్యలో మహిళలు రాజధాని కాబూల్ లో నిరసనకు దిగారు. తమ దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ గా గుర్తించాలని వారు నినాదాలు చేశారు. ఈ ఆందోళన విషయాన్ని అక్కడి స్థానిక మీడియా నివేదించింది.
ఆఫ్ఘన్ లో ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఆ దేశానికి చెందిన ఆస్తులను, నిధులను స్తంభింప జేశారు. ఆఫ్ఘన్ ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఆర్ధిక సంక్షోభం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోందని.. రాబోయే చలికాలంలో వారు మరిన్ని ఇబ్బందుల పాలు కావడం ఖాయమని రాజకీయ, ఆర్ధిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ మెజార్టీ ప్రజలు టెంట్ల కింద తలదాచుకుంటున్నారని, రాబోయే శీతాకాలం వారు చలికి మరిన్ని ఇబ్బందులు పడతారని అంటున్నారు. పసిపిల్లలు పరిస్థితి హృదయ విదారకంగా ఉండబోతోందని ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం అక్కడి ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు.
దేశంలో తాజా పరిస్థితిని వివరిస్తూ తాత్కాలిక విదేశాంగ శాఖా మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి అమెరికన్ కాంగ్రెస్ కు ఓ లేఖ కూడా రాశారు. అయితే ఈ లేఖ వాస్తవాలను ప్రతిబింబించేదిగా లేదని ఆఫ్ఘన్ లో అమెరికా ప్రత్యేక ప్రతినిధి థామస్ వెస్ట్ స్పష్టం చేశారు. అయితే ఆఫ్ఘన్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, అత్యవసర చర్యలు తీసుకోకపోతే రాబోయే శీతాకాలంలో వేలాది ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెచ్చరించింది.
Also Read : తాలిబన్లను మించిన చైనా పాలకులు