Domestic Violence is not a male monopoly, women too can be responsible
గృహమే కదా స్వర్గసీమ! అన్న మాటలో నిశ్చయార్థకం లేదు. కదా? అన్నది ప్రశ్న. ఆశ్చర్యార్థకం ఎప్పుడయినా బెనిఫిట్ ఆఫ్ డౌటే. గృహం, స్వర్గసీమ అన్న రెండు నౌన్స్ లో రెండు అస్పష్టతలు అనాదిగా ఉండిపోయాయి. ఇంగ్లీషువాడికి తీపి ఎక్కువ ఇష్టమేమో? స్వీట్ హోమ్ అన్నాడు. మనకు మొదటినుండి గుంటూరు కారమే ఇష్టం. రాయలసీమలో అయితే ఎర్రకారం. ఇంకొంచెం మొరటుగా అయితే గొడ్డుకారం.
సంస్కృతంలో గృ, గ్ర వచ్చిందంటే పట్టి ఉంచేది, పట్టుకునేది అన్న అర్థం వచ్చి తీరుతుంది.
గృహం
గ్రహం
గ్రహణం
గ్రహీత
ఈ వ్యుత్పత్తి ప్రకారం గృహం అంటే అందరినీ పట్టి ఉంచేది లేదా అన్నిటినీ పట్టి ఉంచేది అనుకోవచ్చు. భాషలో మాటలెలా పుట్టాయి అన్నది ఎవరికీ పట్టని విషయం కాబట్టి గృహం మాట పుట్టుక గురించి ఇంతకంటే లోతుగా వెళ్లడం భావ్యం కాదు. గృహం ఆనందాన్ని పట్టుకున్నట్లే మిగతా రసాలను కూడా పట్టుకుంటుంది. అలా గృహం హింసను పట్టుకుంటే అప్పుడది “గృహ హింస” అవుతుంది. హింసకు గృహ మాట నామవాచక విశేషణ పూర్వపదం అవుతుంది. రాజ్య హింస, యుద్ధ హింసలా గృహ హింస కూడా అనాదిగా ఉన్న పారిభాషిక పదమే. అయితే- ఇన్నాళ్లు గృహ హింస అంటే ఇళ్లల్లో మహిళలపై పురుషులు చేసే దౌర్జన్యాలు, దాడులు అనే అనుకునేవారు. ఆ మాటకు వ్యాప్తి అలాగే వచ్చింది. అది ఆ మాట తప్పు కాదు. అర్థాన్వయంలో మన అవగాహనా లోపం. గృహ హింస రెండు మాటల్లో విడిగాగానీ, కలిపిగానీ పురుషుల వల్ల జరిగే హింస అని లేనే లేదు. గృహంలో జరిగే హింస అనే ఈ మాట అర్థం. ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలు ఇన్నాళ్లకు గృహ హింసను సరిగ్గా నిర్వచించి అటు భాషకు, ఇటు భావానికి, మొత్తంగా న్యాయానికి సరయిన తీర్పు చెప్పాయి.
ఇకపై ఇళ్లల్లో మహిళలు పురుషులపై చేసే దాడులు, దౌర్జన్యాలను కూడా గృహ హింస చట్టం పరిధిలోనే విచారిస్తామని కోర్టులు చెబుతున్నాయి. ఇళ్లల్లో చెప్పుకింద తేలులా, నక్కిన పేనులా, మూలాన మూలిగే పిల్లిలా, గోడమీద బల్లిలా, మంచం కోడుకు పట్టిన నల్లిలా హింసను భరిస్తూ మౌనంగా ఉన్న పురుషజాతికి ఇదొక గొప్ప ఉపశమనం కాగలదు.
Domestic Violence Against Men:అయితే నాలుగ్గోడల మధ్య గుట్టుగా తిన్న దెబ్బలకు ప్రచారం కలిగించడం చాలామంది పౌరుషవంతులకు సహజంగా ఇష్టముండదు. భర్త అంటే భరించువాడు అన్నదే అసలయిన వ్యుత్పత్తి అర్థం. మిగతా అర్థాలన్నీ సాధించినవే. కాబట్టి భార్యలు సాధిస్తే భర్తలు భరించడమే యుగధర్మం! అందుకే మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కమని సామెత ఏనాడో చెప్పింది! కేవలం ఈ సామెతను పట్టుకుని ఇన్నాళ్ళుగా మొగుళ్లను కొడుతున్న భార్యలు ఇకపై గృహ హింస చట్టం పరిధిలోకి వస్తారని గ్రహిస్తే బాధిత భర్తలు బతికి బలుసాకు తినగలుగుతారు!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : గృహ హింసకు గూగుల్ పాఠం